Shubman Gill: కివీస్‌తో తొలి టెస్టుకు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. స్టార్ ప్లేయ‌ర్ దూరం!

1st Test vs New Zealand Injured Shubman Gill Out And Sarfaraz Khan In

  • నేటి నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు
  • ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ శుభ్‌మాన్ గిల్ దూర‌మ‌య్యే అవ‌కాశం
  • గిల్ భుజం, మెడ నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ట్లు పేర్కొన్న 'ఇండియా టుడే' 
  • ఒక‌వేళ గిల్ ఆడ‌క‌పోతే సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జ‌ట్టులో చోటు

ఇవాళ్టి నుంచి న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భార‌త్ తొలి టెస్టు ఆడ‌నుంది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ మ్యాచ్‌కు స్టార్ ప్లేయ‌ర్ శుభ్‌మాన్ గిల్ దూర‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఇండియా టుడే నివేదిక పేర్కొంది. అత‌డు భుజం, మెడ నొప్పితో బాధ‌ప‌డుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలిపింది. 

ఒక‌వేళ గిల్ బెంచ్‌కి ప‌రిమిత‌మైతే అత‌ని స్థానంలో యువ ఆట‌గాళ్లు సర్ఫరాజ్ ఖాన్ లేదా ధ్రువ్‌ జురెల్‌ల‌లో ఒక‌రికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌నుంది. ఈ ఇద్ద‌రిలో స‌ర్ఫ‌రాజ్‌కే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవ‌ల జ‌రిగిన ఇరానీ ట్రోఫీలో ఈ యువ సంచ‌ల‌నం డ‌బుల్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. అయితే, గ‌త కొంత‌కాలంగా టీమిండియా త‌ర‌ఫున టెస్టుల్లో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకుంటున్న గిల్ మ్యాచ్‌కు దూర‌మైతే జ‌ట్టుకు కొంత‌మేర న‌ష్ట‌మే అని చెప్పాలి. 

ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్‌తో స్వ‌దేశంలో జరిగిన టెస్టు సిరీస్ నుంచి గిల్ జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అతని చివరి 10 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. కీల‌క స‌మ‌యాల్లో మంచి ఇన్నింగ్స్‌ల‌తో ఈ యువ ఆట‌గాడు భార‌త జ‌ట్టుకు అండ‌గా నిలుస్తున్నాడు. టీమిండియా విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.  

9వేల ప‌రుగుల మైలురాయికి 53 ర‌న్స్ దూరంలో కోహ్లీ
భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మ‌రో మైలురాయికి చేరువ‌య్యాడు. నేటి నుంచి కివీస్‌తో జ‌రిగే టెస్టులో మ‌రో 53 ప‌రుగులు చేస్తే 9వేల ప‌రుగుల మైలురాయిని పూర్తి చేసుకోనున్నాడు. దీంతో భార‌త జ‌ట్టు త‌ర‌ఫున టెస్టుల్లో 9వేల ర‌న్స్ చేసిన నాలుగో ప్లేయ‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు 115 టెస్టులు ఆడిన విరాట్ 8,947 ప‌రుగులు చేశాడు. ఈ జాబితాలో లిటిల్ మాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ 15,921 ర‌న్స్‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అయితే, గ‌త‌ కొంత‌కాలంగా ర‌న్‌మెషిన్ మునుప‌టిలా ధాటిగా బ్యాటింగ్ చేస్తూ ప‌రుగులు చేయ‌డంలో విఫ‌లం అవుతున్నాడు. ఈ ఏడాది మూడు టెస్టులు ఆడిన కోహ్లీ ఒక్క అర్ధ శ‌త‌కం కూడా న‌మోదు చేయ‌లేక‌పోయాడు.

కివీస్‌తో తొలి టెస్టుకు భారత తుది జ‌ట్టు (అంచ‌నా): రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌ దీప్.

  • Loading...

More Telugu News