Babar Azam: బాగా ఆడలేదని బాబర్ ను తప్పించారు... టీమిండియా ఇలా ఎప్పుడూ చేయలేదు: ఫఖార్ జమాన్

Fakhar Zaman slams PCB on Babar Azam omission from Pakistan squad

  • ముల్తాన్ టెస్టులో ఇంగ్లండ్ చేతిలో పాక్ ఘోర పరాజయం
  • పాక్ జట్టులో భారీగా ప్రక్షాళన
  • బాబర్ అజామ్ సహా సీనియర్ ఆటగాళ్లపై వేటు

ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో పాక్ జట్టులో ప్రక్షాళన చేపట్టారు. మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, సీనియర్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, యువ పేసర్ నసీమ్ షాలపై వేటు వేశారు. మిగిలిన రెండు టెస్టుల్లో ఆడే పాక్ జట్టు నుంచి వారిని తప్పించారు. 

దీనిపై పాక్ స్టార్ బ్యాట్స్ మన్ ఫఖార్ జమాన్ స్పందించాడు. బాగా ఆడలేదన్న కారణంతో బాబర్ అజామ్ ను తప్పించారని, కానీ విరాట్ కోహ్లీ ఫామ్ లో లేక, పరుగులు రాక సతమతమవుతున్నప్పుడు కూడా అతడిని టీమిండియా నుంచి తప్పించలేదని అన్నాడు. 

2022 డిసెంబరు నుంచి బాబర్ అజామ్ టెస్టుల్లో కనీసం ఒక్క అర్ధసెంచరీ కూడా చేయకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే సీనియర్ ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మద్దతుగా నిలవాలని ఫఖార్ జమాన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ బోర్డు కోహ్లీ కష్టకాలంలో అతడి వెన్నంటే నిలిచిందని గుర్తుచేశాడు. 

2020 నుంచి 2023 వరకు కోహ్లీ రాణించలేదు... అతడి సగటులు చూస్తే 19.33, 28.21, 26.50... అయినప్పటికీ అతడిని టీమిండియా ఒక్క మ్యాచ్ లోనూ పక్కనబెట్టలేదు అని వెల్లడించాడు. కానీ, పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడు అనదగ్గ బ్యాట్స్ మన్ ను ఈ విధంగా తొలగించడం అనేది నెగెటివ్ సంకేతాలను పంపిస్తుందని జమాన్ అభిప్రాయపడ్డాడు. 

జట్టులో ఉన్నట్టుండి భారీ మార్పులు చేయాల్సినంత అవసరం ఇప్పుడేమీ లేదని అన్నాడు. కీలక ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడానికి బదులు, వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఫఖార్ జమాన్ స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News