Jagga Reddy: రేవంత్ రెడ్డిని ఒప్పించి తీసుకొస్తా... కేసీఆర్‌ను తీసుకు రా: హరీశ్ రావుకు జగ్గారెడ్డి సవాల్

Jagga Reddy challanges Harish Rao

  • రుణమాఫీపై సిద్దిపేటలో కూడా చర్చకు సిద్ధమన్న జగ్గారెడ్డి
  • జగ్గారెడ్డి అదిరేటోడు... బెదిరేటోడు కాదని వ్యాఖ్య
  • రుణమాఫీకి సంబంధించి పబ్లిసిటీ దగ్గర ఫెయిలయ్యామన్న జగ్గారెడ్డి

రుణమాఫీపై ఎల్లిగాడు... మల్లిగాడు కాకుండా నేరుగా రేవంత్ రెడ్డి, కేసీఆర్ చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని హరీశ్ రావును సవాల్ చేశారు. తాను ముఖ్యమంత్రిని ఒప్పించి తీసుకు వస్తానని, కేసీఆర్‌ను ఒప్పించి హరీశ్ రావు తీసుకు రావాలన్నారు. ఇరువురి మధ్య అక్కడో... ఇక్కడో చర్చకు భయమైతే సిద్దిపేటలో కూడా సిద్ధమన్నారు. దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ...  ఓటమి అనేక పాటలు నేర్పిస్తుందని, తాను ఓడినా తన భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చిందన్నారు.

రేవంత్ రెడ్డి పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిని ఇచ్చినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తన భార్య నిర్మల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందన్నారు. ఏ పండుగ వచ్చినా తాను సంగారెడ్డిలో ముందుండి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. జగ్గారెడ్డి బలహీనుడు కాదని... అదిరేటోడు.. బెదిరేటోడు కాదని, ఒక ఫైటర్ అన్నారు. 1995లో ఓ సమయంలో రిగ్గింగ్ చేశానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేలాదిమందితో పోలీస్ స్టేషన్‌ను ముట్టడించానన్నారు. ఎంత తోపులమైనా సరే కాటికి వెళ్లక తప్పదన్నారు.

రుణమాఫీకి సంబంధించి తాము పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యామన్నారు. బీఆర్ఎస్ మాత్రం పబ్లిసిటీ దగ్గర పాస్ అయిందని వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని తాము చెబుతూనే ఉన్నామని, కానీ హరీశ్ రావు మాత్రం అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాళా పరిస్థితికి తెచ్చారని ఆరోపించారు. తొమ్మిదిన్నర బీఆర్ఎస్ పాలనలో రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. రుణమాఫీ జరగని రైతుల వివరాలను తీసుకురావాలంటూ అధికారులను సీఎం ఆదేశించినట్లు జగ్గారెడ్డి చెప్పారు.

  • Loading...

More Telugu News