Sanju Samson: హైదరాబాద్ టీ20లో విధ్వంసంపై సంజూ శాంసన్ స్పందన ఇదే

The leadership tells me they back me no matter what says Sanju Samson

  • తన ఆట పట్ల జట్టు సభ్యులు సంతోషంగా ఉండడం ఆనందంగా ఉందన్న సెంచరీ హీరో
  • ఎలా ఆడినా మద్దతిస్తామని టీమ్ నాయకత్వం చెప్పిందన్న సంజూ శాంసన్
  • బాగా ఆడగలననే నమ్మకంతో ఆడానని మ్యాచ్ అనంతరం వెల్లడి

ఎన్నో అవకాశాలు లభిస్తున్నా అంతర్జాతీయ క్రికెట్‌లో సరిగా రాణించలేక సతమతమవుతున్న యువ ప్లేయర్ సంజూ శాంసన్ శనివారం రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో అదరగొట్టాడు. కేవలం 47 బంతుల్లోనే 111 పరుగులు బాది ఔట్ అయాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 11 ఫోర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సంజూ శాంసన్ విధ్వంసంతో టీమిండియా ఏకంగా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

తన ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం సంజూ శాంసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాను బాగా ఆడడంతో జట్టు సభ్యులు సంతోషంగా ఉన్నారని, అందుకే తనకు కూడా ఆనందంగా ఉందని చెప్పాడు. తాను బాగా ఆడగలనని నమ్మి ఈ ఇన్నింగ్స్‌ను ఆడానని చెప్పాడు. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు ఆడి విఫలమవడంతో ఒత్తిడిలో ఉన్నానని పేర్కొన్నాడు. అయితే వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని, ఆటపై మాత్రమే దృష్టి పెట్టానని అతడు వివరించాడు. దేశం తరుపున ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఉంటుందని, దానిని అదిగమించి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకున్నానని చెప్పాడు.

ఇక తనకు జట్టు నాయకత్వం సంపూర్ణ మద్దతు లభించిందని సంజూ శాంసన్ వెల్లడించాడు. తాను ఎలా ఆడినా మద్దతుగా నిలుస్తామని చెప్పారని వివరించాడు. కేవలం మాటల్లోనే కాకుండా ఆచరణలో కూడా చూపించారని అన్నాడు. గత సిరీస్‌లో తాను రెండు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యానని, ఏం జరుగుతుందో ఏమోనని భయపడుతూ కేరళకు తిరిగి వెళ్లానని, అయితే తిరిగి ఇక్కడ ఉన్నానంటూ సంజూ శాంసన్ నవ్వుతూ చెప్పాడు.

  • Loading...

More Telugu News