Devaragattu Bunny Festival: దేవరగట్టు బన్నీ ఉత్సవం .. కర్రల సమరంలో 100 మందికి గాయాలు

100 people injured in Devaragattu bunny utsavam

  • కర్నూలు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన సమరం
  • 20 మందికి తీవ్ర గాయాలు
  • గాయపడిన వారిని ఆదోని, బళ్లారి ఆసుపత్రులకు తరలింపు

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో భాగంగా జరిగిన కర్రల సమరంలో 100 మందికి పైగా గాయపడ్డారు. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఆదివారం వేకువజామున జరిగిన బన్నీ ఉత్సవాన్ని తిలకించేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఏటా దసరా సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవాన్ని సంప్రదాయకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు కర్రలతో తలపడతారు. ఈ ఏడాది కూడా సంప్రదాయ ప్రకారం బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా జరిగిన కర్రల సమరంలో వంద మందికిపైగా గాయపడ్డారు. వారిలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆదోని, బళ్లారి ఆసుపత్రులకు తరలించారు. 
 
దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతా మూర్తులను కాపాడుకోవడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒక వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరో వైపున కర్రలతో తలబడతారు.

ఈ క్రమంలో గాయాలు అవుతున్నా లెక్క చేయకుండా బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. గాయపడిన వారిని స్థానిక వైద్య శిబిరంలో చేర్పించి చికిత్స అందిస్తారు. పరిస్థితి విషమంగా ఉంటే పట్టణంలోని ఆసుపత్రికి తరలిస్తుంటారు. కొద్దిపాటి గాయాలైన వారు పసుపు రాసుకుని వెళ్లిపోతుంటారు.

  • Loading...

More Telugu News