Rahul Gandhi: తమిళనాడులో రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ ట్వీట్

Rahul Gandhi tweets on Train accident in Tamil Nadu

  • గూడ్సు రైలును ఢీకొన్న మైసూరు-దర్భంగా ఎక్స్ ప్రెస్ రైలు
  • పట్టాలు తప్పిన 12 బోగీలు... రెండు కోచ్ లు దగ్ధం
  • పలువురికి గాయాలు
  • కేంద్రం ఇంకెప్పుడు మొద్దు నిద్రను వీడుతుందన్న రాహుల్ గాంధీ
  • ఇంకెన్ని కుటుంబాలు నాశనం కావాలి? అంటూ ఆగ్రహం

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టయ్ రైల్వే స్టేషన్ వద్ద మైసూరు-దర్భంగా ఎక్స్ ప్రెస్ రైలు ఓ గూడ్స్ రైలును ఢీకొనడం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దర్భంగా ఎక్స్ ప్రెస్ కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పగా, రెండు బోగీలు దగ్ధమయ్యాయి. 

ఈ ఘటనపై లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. రైలు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. 

ఇలాంటి ఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇంకా గుణపాఠం నేర్చుకోలేదని, కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలంటే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి? అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇకనైనా కళ్లు తెరిచి రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

కాగా, తమిళనాడు రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం తిరువళ్లూరు జిల్లాలో ఘటన స్థలి వద్ద యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. 

ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్ఎన్ సింగ్ స్పందిస్తూ, ప్రమాదానికి గల కారణాలు విచారణలో వెల్లడవుతాయని తెలిపారు. బాధ్యులపై చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News