Vijayawada: నేటితో ముగియనున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు .. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు

kanaka durga as rajarajeswari devi in vijayawada
  • ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
  • భారీగా తరలివస్తున్న భవానీలు
  • నేటి రాత్రి తెప్పోత్సవంతో ముగియనున్న ఉత్సవాలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. విజయ దశమి ఉత్సవాల చివరి రోజు కావడంతో తండోపతండాలుగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరో వైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు.

ఈ సారి భవానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు. క్యూలైన్లు మొత్తం జై దుర్గ.. జై జై దుర్గ నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తులు, భవానీల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో క్యూలైన్లలో యథావిధిగా మంచినీళ్లు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు. శనివారం రాత్రి నిర్వహించే తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. 

కృష్ణానదిలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో దుర్గా ఘాట్ వద్దే తెప్పోత్సవం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రానికి నదిలో నీటి ప్రవాహం తగ్గితే యథావిధిగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. నదిలో నీటి ప్రవాహం అంతే విధంగా కొనసాగితే ఘాట్ వద్దే హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Vijayawada
Indrakeladri
dussehra

More Telugu News