Bengaluru: 'నీ దుస్తులు నచ్చలేదు, యాసిడ్ పోస్తా'నంటూ మహిళను బెదిరించిన ఉద్యోగి

A man in Bengaluru was fired by his employer and a case was filed against him for threatening to throw acid on a woman

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్ ఘటన
  •  ముఖం మీద యాసిడ్ పోస్తానంటూ యువకుడి బెదిరింపు
  • ఉద్యోగంలోంచి తొలగించి నిందితుడిపై కేసు పెట్టిన ప్రైవేటు కంపెనీ

‘నువ్వు ధరిస్తున్న దుస్తులు నచ్చలేదు. నీ ముఖం మీద యాసిడ్ పోస్తా’ అంటూ ఓ మహిళను బెదిరించిన ఓ వ్యక్తిని అతడు పని చేస్తున్న కంపెనీ ఉద్యోగంలోంచి పీకిపడేసింది. బెంగళూరు మహానగరంలో ఈ ఘటన జరిగింది. దుస్తుల విషయంలో నిందితుడు నికిత్ శెట్టి తన భార్య ఖ్యాతి శ్రీని బెదిరించాడంటూ ఆమె భర్త షాబాజ్ అన్సార్ తెలిపారు. ‘‘నా భార్య దుస్తుల విషయమై ఆమె ముఖంపై యాసిడ్ పోస్తానని ఈ వ్యక్తి బెదిరిస్తున్నాడు. దయచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోండి’’ అంటూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. నిందితుడికి సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్ ఫొటోలను కూడా షేర్ చేశారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ జర్నలిస్ట్ అయిన షాబాజ్ అన్సార్.. కర్ణాటకలో ముఖ్యమైన అధికారులను కూడా ట్యాగ్ చేశారు.

మరోవైపు నెటిజన్లు నిందితుడు నికిత్ శెట్టి పని చేస్తున్న కంపెనీని గుర్తించారు. దీంతో అతడిపై చర్యలకు సదరు కంపెనీ ఉపక్రమించింది. అతడిని ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించింది. అతడిపై కేసు కూడా నమోదైందని తెలిపింది. ఇతర వ్యక్తుల దుస్తుల ఎంపికపై బెదిరింపునకు పాల్పడిన వ్యక్తి తమ ఉద్యోగులలో ఒకరైన నికిత్ శెట్టి కావడంతో చాలా బాధపడ్డామని, అతడి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని డిజిటల్ సర్వీసెస్ కంపెనీ ఎటియోస్ సర్వీసెస్‌ పేర్కొంది. తాము పాటించే ప్రధాన విలువలకు నికిత్ శెట్టి విరుద్ధంగా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని, దీనిని అతిక్రమించిన నికిత్‌‌ను ఐదేళ్లపాటు తొలగిస్తున్నామని ప్రకటించింది.

అతడి చర్యలకు జవాబుదారీగా ఉండేందుకు కేసు కూడా నమోదు చేశామని కంపెనీ తెలిపింది. కాగా తన భార్యపై ఖ్యాతి శ్రీని యాసిడ్ తో దాడి చేస్తానని బెదిరించిన వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడని, సత్వరమే స్పందించి అతడిని తొలగించడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని బాధితురాలి భర్త తెలిపారు. కాగా ఎటియోస్ సర్వీసెస్ కంపెనీ స్టాక్ మార్కెటింగ్ ఏజెన్సీ. స్టాక్ మార్కెట్లకు సంబంధించిన డిజిటల్ సర్వీసులను అందిస్తుంటుంది.

  • Loading...

More Telugu News