Surpanch Elections: నన్ను గెలిపిస్తే ఈ పనులన్నీ చేసి పెడతా.. మ్యానిఫెస్టో విడుదల చేసిన సర్పంచ్ అభ్యర్థి
- యాదాద్రి జిల్లా మల్కాపూర్‌లో ఓ నాయకురాలు వినూత్న ప్రయోగం
- 14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టో
- మల్కాపూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ
సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోను విడుదల చేయడం సర్వ సాధారణ విషయం. తాము అధికారంలోకి వస్తే చేసే పనుల గురించి అందులో పేర్కొంటాయి. ప్రచారంలో దాని గురించే విస్తృతంగా చెప్పుకుంటాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ ఓ అభ్యర్థి ముందస్తుగానే రెడీ అయ్యారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్‌లో ఓ సర్పంచ్ అభ్యర్థి తన మ్యానిఫెస్టోను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొత్తం 14 అంశాలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కొడారి లత అనే నాయకురాలు పార్టీలకు అతీతంగా తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
మ్యానిఫెస్టో ఇలా..
1. గ్రామంలో మంచినీటి ఫిల్టర్ ఏర్పాటు
2. కులాలకు అతీతంగా చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల కోసం వైకుంఠ రథం, ఫ్రీజర్
3. ఇంటి పన్ను మాఫీ
4. ఇంట్లో ఎవరైనా చనిపోతే రూ. 20 వేల ఆర్థిక సాయం
5. ఆడపిల్ల జన్మిస్తే రూ. 5 వేలు
6. ఆడపడుచు పెళ్లి కానుక
7. ఒంటరి మహిళకు, వృద్ధులకు నివాస వసతి గృహం
8. ఎస్సీ, బీసీలకు కమ్యూనిటీ హాల్
9. నిరుద్యోగ ఆడపడుచులకు 30 కుట్టు మిషన్లతో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్
10. స్కూలు పిల్లలకు నోటు పుస్తకాలు
11. ముదిరాజ్‌లు చేపలు పెంచుకునేందుకు చెరువులపై పూర్తి అధికారం
12. గ్రామ దేవత గుడి నిర్మాణం
13. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణం
14. బస్తీ దవాఖానా, గ్రంథాలయం