Private Travels: దసరా ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేటు ట్రావెల్స్.. రెట్టింపు చార్జీల వసూలు

AP private bus travels hikes bus charges from Dasara travellers

  • ఏపీలో ప్రైవేటు ట్రావెల్స్ అడ్డగోలు దోపిడీ
  • పండగకు వెళ్లాలనుకునే ప్రయాణికుల నుంచి రెండింతల చార్జీల వసూలు
  • విజయవాడ నుంచి విశాఖకు ఏకంగా రూ. 2,500 వసూలు
  • తిరుగు ప్రయాణంలో అయితే రూ. 3 వేలు
  • ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్న టికెట్ ధరలు

దసరా పండుగ కోసం ఊరెళ్లాలనుకునే వారు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ల దోపిడీకి గురవుతున్నారు. దసరా రద్దీని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న ట్రావెల్స్ చార్జీలను అడ్డగోలుగా పెంచేస్తూ ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. సీట్లు ఫుల్ అయిపోయాయని, కొన్ని సీట్లే ఉన్నాయని చెప్పి లేని కొరతను సృష్టిస్తూ అధిక చార్జీలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో సీట్లు ఖాళీ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఎంచుకుంటున్నారు. శనివారం దసరా కావడం, ఆదివారం సెలవు దినం కావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు గురు, శుక్రవారాల్లోనే సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది.

ఏపీలో 1200 వరకు అద్దె బస్సులున్నాయి. రద్దీ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో చార్జీలను ఏసీ బస్సుల్లో అయితే రూ. 1000, నాన్ ఏసీ బస్సుల్లో అయితే రూ. 700 వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లాలనుకునే వారు చార్జీల మోతకు షాక్ అవుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఏకంగా రూ. 2 వేల నుంచి రూ. 2500 వరకు వసూలు చేస్తున్నాయి. విజయవాడ నుంచి కాకినాడకు రూ. 1500 నుంచి రూ. 2 వేలు వసూలు చేస్తున్నారు. 

అదే సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సుల్లో విజయవాడ నుంచి వైజాగ్‌కు రూ 905, అమరావతి నుంచి అయితే రూ. 1,120 మాత్రమే వసూలు చేస్తుండగా, నాన్ ఏసీ బస్సుల్లో ఈ ధరలు రూ. 700 మాత్రమే. అయితే, సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్నా ఒకటి రెండ్రు సీట్లు మాత్రమే ఉండడంతో కుటుంబంతో కలిసి ఊరెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు, ఆదివారంతో దసరా సెలువులు ముగిసి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణాలుంటాయి. అప్పుడు బస్సులకు మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని కూడా సొమ్ము చేసుకోవాలని, రెండింతల చార్జీలను వసూలు చేయాలని ప్రైవేటు ట్రావెల్స్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ టికెట్ ధరలను కొన్ని ట్రావెల్స్ రూ. 3 వేలుగా చెబుతూ ఆన్‌లైన్‌లో పెట్టాయి.

  • Loading...

More Telugu News