Bigg Boss 18: బిగ్‌బాస్ సెట్స్‌లో గాడిద.. తొలగించాలంటూ సల్మాన్‌కు ‘పెటా ఇండియా’ లేఖ
- హిందీ బిగ్‌బాస్ 18లో గాడిదను కూడా భాగం చేసిన నిర్వాహకులు
- హౌస్‌మేట్స్‌కు దాని సంరక్షణ బాధ్యతలు
- వినోదం కోసం జంతువులను వాడుకుంటారా? అని పెటా ఆగ్రహం
- దానిని తమకు అప్పగిస్తే అభయారణ్యంలో వదిలిపెడతామన్న పెటా
హిందీ బిగ్‌బాస్ షోపై పెటా (పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. వినోదం కోసం గాడిదను వాడుకుంటారా? అంటూ మండిపడింది. సెట్స్ నుంచి దానిని బయటకు తీసుకొచ్చి తమకు అప్పగించాలని బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్‌ఖాన్‌కు లేఖ రాసింది. ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాస్ 18 షోలో ‘గధారాజ్’ (గాడిద) కూడా సందడి చేస్తోంది. గార్డెన్ ప్రాంతంలో దాని కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. దాని సంరక్షణ బాధ్యతలు హౌస్‌మేట్స్‌కు అప్పగించారు.
బిగ్‌బాస్ హౌస్‌లో గాడిదను చూసిన చాలామంది పెటా ఇండియాకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జంతు రక్షణ సంస్థ స్పందిస్తూ సల్మాన్‌ఖాన్‌కు లేఖ రాసింది. వినోదం కోసం జంతువులను వాడుకోవడం తగదని, సెట్ నుంచి దానిని తొలగించేలా నిర్వాహకులను కోరాలని అభ్యర్థించింది. దానిని తమకు అప్పగిస్తే రక్షించిన గాడిదలతోపాటు దానిని అభయారణ్యానికి తరలిస్తామని పేర్కొంది.