Ratan Tata: రతన్ టాటా మరణంపై ముకేశ్ అంబానీ స్పందన ఇదే

Reliance Industries Chairman Mukesh Ambani expressed deep sorrow over the death of Ratan Tata

  • రతన్ టాటా మరణం భారతదేశానికి దుఃఖ దినమన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
  • దేశం విశేషమైన పుత్రుల్లో ఒకర్ని కోల్పోయిందని వ్యాఖ్య
  • భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసలు
  • ప్రియమైన స్నేహితుడిని కోల్పోయానంటూ భావోద్వేగం
  • ఎక్స్ వేదికగా సుధీర్ఘ పోస్టు పెట్టిన ముకేశ్ అంబానీ

టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా మరణంపై దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కూడా స్పందించారు. రతన్ టాటా మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటా మరణం భారతదేశానికి దుఃఖ దినమని ఆయన అభివర్ణించారు. తనకు వ్యక్తిగత నష్టమని విచారం వ్యక్తం చేశారు. రతన్ టాటాను దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా, పరోపకారిగా, ప్రియమైన స్నేహితుడిగా ముకేశ్ అంబానీ అభివర్ణించారు. దూరదృష్టి గల పారిశ్రామికవేత్తగా, దాతృత్వ నాయకుడిగా ఆయన చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. టాటా కుటుంబానికి, టాటా గ్రూప్‌నకు ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

గ్లోబల్ స్థాయిలో భారత్ ఎదగడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారని ముకేశ్ అంబానీ కొనియాడారు. దేశాభివృద్ధికి, దాతృత్వానికి ఎనలేని సహకారం అందించారని ప్రస్తావించారు. టాటా గ్రూప్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. సద్గుణవంతుడు, గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా పాటించిన విలువలు అందరికీ స్ఫూర్తినిస్తాయని ముకేశ్ అంబానీ అన్నారు.

రతన్ టాటా మరణం టాటా గ్రూప్‌కే కాకుండా ప్రతి భారతీయునికి పెద్ద నష్టమని ముకేశ్ అంబానీ అన్నారు. వ్యక్తిగత స్థాయిలో తనకు కూడా తీరని శోకాన్ని నింపిందని విచారం వ్యక్తం చేశారు. తాను ప్రియమైన ఒక స్నేహితుడిని కోల్పోయానని, ఆయన చర్య తనకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు.

భారతదేశం ఒక పుత్రుడిని కోల్పోయింది
రతన్ టాటా మరణంతో భారతదేశం తన అత్యంత విశిష్టమైన, దయాగుణం కలిగిన పుత్రుల్లో ఒకరిని కోల్పోయిందని ముకేశ్ అంబానీ అభివర్ణించారు. రతన్ టాటా భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని, ప్రపంచంలోకెల్లా అత్యుత్తమమైన వాటిని మన దేశానికి తీసుకొచ్చారని కొనియాడారు. టాటా గ్రూప్ చైర్మన్‌గా 1991లో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టాటా గ్రూప్‌ను 70 రెట్లు పెంచారని ముకేశ్ అంబానీ అన్నారు. ‘‘రిలయన్స్ కంపెనీ, నీతా అంబానీ, ఇతర అంబానీ కుటుంబం తరపున టాటా కుటుంబ సభ్యులకు, మొత్తం టాటా గ్రూపు సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. రతన్.. మీరెప్పుడూ నా హృదయంలో నిలిచే ఉంటారు’’ అని ఎక్స్ పోస్టులో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News