Geetanjali: ఐదు నిమిషాల్లో అమ్మ చనిపోతుందని ఎవరనుకుంటారు?: నటి గీతాంజలి తనయుడు శ్రీను
- నాన్నగారి బెస్ట్ ఫ్రెండ్ శోభన్‌బాబు
- ఆయన సూచనలను పాటించేవారు
- అమ్మ చాలా కలుపుగోలు మనిషి
- అప్పటివరకూ నాతో టీవీ చూశారు
- ఆమె చనిపోతుందని అనుకోలేదన్న శ్రీను
గీతాంజలి అనేక చిత్రాలలో కథానాయికగా సందడి చేశారు. ఆ తరువాత కాలంలో కేరక్టర్ ఆర్టిస్టుగాను కనిపించారు. తనయుడు శ్రీనుని హీరోగా చేయడానికి ఆమె ప్రయత్నించారు గానీ కుదరలేదు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీను మాట్లాడుతూ, తన తల్లిదండ్రుల గురించి అనేక విషయాలను పంచుకున్నారు.
"ఇండస్ట్రీలో మా నాన్నగారికి శోభన్‌బాబు గారు, కృష్ణంరాజు గారు, శివాజీ గణేశన్ గారు, చలంగారు మంచి స్నేహితులు. శోభన్‌బాబుగారి స్థాయిలో నాన్నగారు సినిమాలు చేయలేదుగానీ, ఆయన సూచనలను పాటిస్తూ సంపాదనను జాగ్రత్త చేసుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆయనను హాస్పిటల్‌లో చేర్పించాము. ఆ వార్డులో ఉన్న పేషెంట్స్ చనిపోతుండటం చూసి ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది" అని గుర్తుచేసుకున్నారు.
" ఇక మా అమ్మగారి విషయానికి వస్తే, ఆ రోజున ఆమెనే వంట చేశారు. తన పనులన్నీ చాలా హుషారుగా చేసుకున్నారు. ఎప్పటిలానే తన స్నేహితులందరికీ కాల్ చేసి మాట్లాడారు. టీవీలో 'బిగ్ బాస్' చూస్తూ నాతో మాట్లాడారు. నేను ముఖం కడుక్కుందామని అలా పక్కకి వెళ్లాను అంతే .. పనమ్మాయి వచ్చి పిలిచింది. కడుపులో నొప్పిగా ఉందని అమ్మ నాతో చెప్పింది. ఐదే నిమిషాల్లో ఆమె ఈ లోకంలో లేకుండా పోయారు. నేనే నమ్మలేని పరిస్థితి అది. నాలానే తన స్నేహితులంతా ఆశ్చర్యపోయారు" అని చెప్పారు.