Humsafar Policy: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ‘హమ్‌సఫర్ పాలసీ’ ప్రారంభం

Nitin Gadkari launched Humsafar Policy to facilitate clean toilets and baby care rooms along the national highways network


జాతీయ రహదారుల వెంబడి వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం కీలక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. పరిశుభ్రమైన టాయిలెట్లు, బేబీ కేర్ రూమ్‌లతో పాటు మరిన్ని సౌలభ్యాలు కల్పిస్తూ ‘హమ్‌సఫర్ పాలసీ'ని ఆవిష్కరించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ పాలసీని మంగళవారం ప్రారంభించారు.

‘హమ్‌సఫర్ పాలసీ’ ప్రారంభం సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. హమ్‌సఫర్ బ్రాండ్ దేశ హైవే నెట్‌వర్క్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందిస్తుందని అన్నారు. ప్రయాణికులు, డ్రైవర్లకు అత్యంత భద్రత కల్పిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల వెంబడి సౌకర్యాలకు పర్యాయపదంగా మారుతుందని ఆయన అన్నారు. జాతీయ రహదారుల వెంబడి నాణ్యమైన, ప్రామాణికమైన సేవలను అందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు. హైవే నెట్‌వర్క్ అంతటా అత్యున్నత స్థాయి సౌకర్యాలను అందించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. అందరికీ వేగవంతమైన, చక్కటి అనుభూతితో నిరంతరాయ ప్రయాణాలను అందించడానికి కేంద్రం సంసిద్దంగా ఉందన్నారు.

సౌకర్యాలు ఇవే..
‘హమ్‌సఫర్ పాలసీ’లో భాగంగా జాతీయ రహదారుల వెంబడి క్లీన్ టాయిలెట్‌లు, బేబీ కేర్ రూమ్‌లు, దివ్యాంగులకు వీల్‌చైర్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, పార్కింగ్ స్థలాలు, ఇంధన ఫిల్లింగ్ కేంద్రాల్లో డార్మిటరీ సేవలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ విధానం హైవే వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాహనదారులకు సురక్షితమైన, ఆనందదాయకమైన అనుభూతిని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఈ విధానం వ్యవస్థాపకులకు సాధికారత అందిస్తుందని, ఉద్యోగాల సృష్టి, జీవనోపాధిని మెరుగుపరచడంలో తోడ్పాటునిస్తుందని కేంద్రం భావిస్తోంది.

  • Loading...

More Telugu News