Suthivelu: నాన్న అందుకే చనిపోయారు: నటుడు 'సుత్తివేలు' కూతురు శ్రీదేవి!
- ఒకప్పుడు నాన్నగారు చాలా బిజీ
- ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్లాక నాన్న ఖాళీ అయ్యారు
- అదే మానసికంగా ఆయనను కుంగదీసింది
- ఆయనకి హార్ట్ ఎటాక్ రావడానికి కారణమైందన్న శ్రీదేవి
తెలుగు తెరపై నవ్వుల సందడి చేసిన హాస్యనటులలో సుత్తివేలు ఒకరు. 1980-90లలో ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. అంతగా ఆయన తన ప్రభావాన్ని చూపించారు. ఉత్తమ నటుడిగా అవార్డులను గెలుచుకున్నారు. అలాంటి సుత్తివేలు గురించి ఆయన కూతురు శ్రీదేవి ప్రస్తావించారు. "సినిమాలలో అవకాశాల కోసం నాన్న పెద్దగా కష్టాలు పడలేదు. ఆయన నాటకాలలో చేస్తున్నప్పుడు చూసి అవకాశాలు ఇచ్చారు. అప్పటి నుంచి నాన్న వెనుదిరిగి చూసుకోలేదు" అని అన్నారు.
"చెన్నైలో ఉన్నప్పుడు మాకు దగ్గరలోనే బ్రహ్మానందం గారు .. బాబూమోహన్ గారు .. రాళ్లపల్లి గారు ఉండేవారు. తరచూ వాళ్లు మా ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. షూటింగు లేకపోతే నాన్న ఎక్కువసేపు పూజలో ఉంటారు. పూజ పూర్తయ్యేవరకూ ఏమీ తినేవారు కాదు. ఆ తరువాత పుస్తకాలు చదువుతూ కూర్చుంటారు. వంటచేయడం అంటే ఆయనకి చాలా సరదా. బయటికి వెళ్లడం చాలా తక్కువనే చెప్పాలి" అని అన్నారు.
"చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కి మారిపోయింది. హైదరాబాదులో నాన్న ఉండటానికి ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. ఆ కారణంగా ఆయన చెన్నైలోనే ఉండిపోవలసి వచ్చింది. అందువలన ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఎంతో బిజీగా ఉండే ఆయన, పనిలేకుండా ఉండటం వలన మానసిక పరమైన ఒత్తిడికి గురయ్యారు. అందువల్లనే ఆయనకి హార్ట్ ఎటాక్ వచ్చింది" అని చెప్పారు.