Special Buses: దసరా ఎఫెక్ట్... స్పెషల్ బస్సులు ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ
- దసరా పండుగకు స్వస్థలాలకు వెళుతున్న జనాలు
- బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిట
- 6,304 ప్రత్యేక బస్సులు ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ
దసరా పండుగ నేపథ్యంలో, ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వలసజీవులు హైదరాబాద్ నుంచి తమ స్వస్థలలాకు వెళుతున్నారు. దాంతో, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు విపరీమైన రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ దసరా స్పెషల్ బస్సులు ప్రకటించింది.
దసరా డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని 6,304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎంపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండుగలకు తమ సొంతూళ్లకు వెళ్లే వాళ్లు ఇబ్బంది పడకుండా, వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులు తిప్పుతున్నామని సజ్జనార్ వివరించారు.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉన్నందున, గతేడాదితో పోల్చితే అదనంగా మరో 600 బస్సులు నడుపుతున్నామని వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రద్దీ ఉంటుందని భావిస్తున్నామని సజ్జనార్ తెలిపారు.