Garuda Seva: తిరుమలలో రేపటి గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు చేశాం: ఈవో శ్యామలరావు

TTD made huge arrangements for Garuda Seva

  • తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
  • రేపు గరుడ సేవ
  • లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా

తిరుమల వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం గరుడ సేవ. ఎంతో ప్రాశస్త్యం కలిగిన గరుడ సేవను ప్రత్యక్షంగా చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తిరుమల తరలివస్తారు. ప్రస్తుతం తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రేపు (అక్టోబరు 8) గరుడ సేవ నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోందని ఈవో జె.శ్యామలరావు వెల్లడించారు. గరుడ సేవను వీక్షించేందుకు దాదాపు 3.5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. 

రద్దీ దృష్ట్యా, తిరుమలకు ఎక్కువ వాహనాలు వచ్చే వీల్లేదని స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ప్రైవేటు ట్యాక్సీలకు అనుమతి లేదని చెప్పారు. ఈ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాలకు అనుమతి లేదని అన్నారు. 

గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 400కి పైగా బస్సులు అందుబాటులోకి తీసుకుస్తోందని, 3 వేల ట్రిప్పులు నడిపేందుకు ఏర్పాట్లు చేసిందని వివరించారు. 

భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని ముఖ్య కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. భద్రతకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పారు. భద్రతా ఏర్పాట్ల కోసం 1,200 మంది విజిలెన్స్ సిబ్బంది... 3,800 మంది పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. కేవలం గరుడ సేవ వద్ద 1,500 మంది పోలీసులు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తారని వివరించారు. 

తిరుమల క్షేత్రంలో భక్తులకు సమాచారం అందించేందుకు ముఖ్యమైన కూడళ్ల వద్ద డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఈవో శ్యామలరావు చెప్పారు. శ్రీవారి భక్తులు సంతృప్తికరంగా గరుడసేవను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. 

తిరు మాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని, వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇక, తిరుమలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News