Women T20 World Cup: కివీస్‌పై ఓటమితో భారత అమ్మాయిల జట్టుకు భారీ దెబ్బ.. సంక్లిష్టంగా మారిన టీమిండియా సెమీస్ సమీకరణాలు!
- దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మ్యాచ్
- 58 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
- ఈ పరాజయంతో భారత్ సెమీఫైనల్ ఆశలపై నీళ్లు
- మిగిలిన మూడు మ్యాచుల్లో భారత జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి
- అప్పుడే ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడకుండా సెమీస్‌కు వెళ్లే ఛాన్స్
ఎన్నో ఆశలతో టీ20 ప్రపంచకప్ కోసం యూఏఈలో అడుగుపెట్టిన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆదిలోనే భారీ దెబ్బ తగిలింది. శుక్రవారం నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. దీంతో భారత మహిళా క్రికెట్ జట్టు కష్టాల్లో పడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియాను కివీస్ ఏకంగా 58 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ ఓటమి భారత్ సెమీఫైనల్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో తన తర్వాతి మూడు మ్యాచుల్లో టీమిండియా తప్పక గెలవడంతో పాటు మంచి నెట్‌రేట్‌ను కలిగి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే భారత జట్టు ఇతర జట్ల సమీకరణాలపై ఆధారపడకుండా నేరుగా సెమీస్‌కు చేరుతుంది.
లేనిపక్షంలో గ్రూప్ దశ నుంచే ఇంటిముఖం పట్టాల్సి ఉంటుంది. ఇలా ఈ ఒక్క ఓటమితో భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ఇక గ్రూప్-ఏలో ఉన్న జట్లలో ఆస్ట్రేలియాతో భారత జట్టు గెలవడం అనేది చాలా కష్టం. ఇప్పటికే న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఓటమితో భారత్ రన్‌రేట్ దారుణంగా -2.900గా ఉంది. దీంతో టీమిండియా ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.
టీమిండియా సెమీస్ చేరాలంటే సమీకరణాలివే..
భారత్ సెమీస్ చేరాలంటే తన తర్వాతి రెండు మ్యాచుల్లో పాకిస్థాన్ (ఆదివారం), శ్రీలంక (అక్టోబర్ 9) లను మంచి రన్‌రేట్‌తో ఓడించాలి. తద్వారా టీమిండియా ఖాతాలో నాలుగు పాయింట్లు చేరడంతో పాటు మంచి రన్‌రేట్ కూడా ఉంటుంది. ఇక ఆరుసార్లు టీ20 ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో భారత్ తన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడిస్తే మనకు ఇంకా పెద్ద ప్లస్ అవుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోతే.. న్యూజిలాండ్ తమ మిగిలిన మూడు మ్యాచుల్లో రెండు మ్యాచ్‌లలోనైనా పరాజయం పొందాలి. అప్పుడు సమీకరణం మెరుగైన రన్-రేట్ కారణంగా భారత్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం ఉంటుంది.
ఇదిలాఉంటే... శుక్రవారం దుబాయ్‌లో భారత్‌తో జరిగిన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో రాణించి సూపర్ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్‌కు కెప్టెన్ సోఫీ డివైన్ చేసిన చక్కటి అర్ధ సెంచరీ ఎంతో కలిసొచ్చింది. దాంతో న్యూజిలాండ్ 160 పరుగుల మంచి స్కోరు సాధించింది. ఆ తర్వాత 161 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన టీండియా 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 58 రన్స్ తేడాతో భారత జట్టు ఓడిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో మైర్ 4, తహుహు 3, కార్సన్ రెండు వికెట్లు తీశారు.