software employee: మియాపూర్‌ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసును ఛేదించిన పోలీసులు

suspect arrested in software employee murder case
  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని బండి స్పందనను హత్య చేసింది సహచర ఉద్యోగి మనోజ్ అని గుర్తించిన పోలీసులు
  • ప్రేమను తిరస్కరించడంతో పాటు ఇతరులతో స్నేహంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక స్పందనను హత్య చేసిన మనోజ్ 
  • సీసీ పుటేజీ, సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా కేసులో పురోగతి సాధించిన పోలీసులు  
ఇటీవల మియాపూర్‌లో దారుణ హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బండి స్పందన కేసులో పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం మియాపూర్ దీప్తిశ్రీ నగర్ సీబీఆర్ ఎస్టేట్ 3ఏ బ్లాక్ లో బండి స్పందన హత్యకు గురైంది. ఈ ఘటన తీవ్ర సంచలనం అయింది. వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్ గా పని చేస్తున్న విజయకుమార్‌, స్పందన ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2022 ఆగస్టులో పెద్ద సమక్షంలో వీరి వివాహం జరగ్గా, ఏడాది తిరగకమునుపే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో తనను భర్త వేధిస్తున్నాడని మియాపూర్ పోలీసు స్టేషన్‌లో స్పందన ఫిర్యాదు చేయడంతో విజయకుమార్ పై కేసు నమోదైంది. వీరి విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది.

ఈ క్రమంలో స్పందన ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తల్లి సమ్రత వద్దే ఉంటోంది. నాలుగు రోజుల క్రితం పాఠశాల నుండి సమ్రత ఇంటికి వచ్చే సమయానికి కుమార్తె స్పందన మరణించి ఉంది. శరీరంపై కత్తి పోట్లు ఉండటంతో ఎవరో హత్య చేసినట్లుగా భావించారు. అయితే ఘటనా స్థలం వద్ద ఎటువంటి ఆయుధం పోలీసులకు లభించలేదు. ఈ క్రమంలో పోలీసులు సీసీ పుటేజీ, సెల్ టవర్ లోకేషన్ ఆధారంగా దర్యాప్తు జరిపి స్పందనను హత్య చేసింది ఆమె పని చేస్తున్న కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న మనోజ్ అలియాస్ బాలుగా గుర్తించారు. 

హతురాలు స్పందన తన క్లాస్‌మేట్ కావడంతో మనోజ్ ఆమెను ఇష్టపడ్డాడు. అయితే స్పందన వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. భర్తతో విడిపోయి స్పందన తల్లి వద్దే ఉండటంతో మనోజ్ తనను ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. మనోజ్ ప్రపోజల్‌ను స్పందన వ్యతిరేకించడం, మరో పక్క కంపెనీలో సహచర ఉద్యోగులతో స్నేహంగా ఉండటాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. వీరిద్దరి మధ్య పలు మార్లు ఈ విషయంపై గొడవలు జరిగాయి. దీంతో ఆమెపై పగ పెంచుకున్న మనోజ్ ఇటీవల ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశాడు. బండరాయితో మోది, స్క్రూడ్రైవర్ తో విచక్షణారహితంగా మనోజ్ పొడవడంతో ఆమె మృతి చెందింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు మనోజ్ ను అరెస్టు చేసి కేసు మిస్టరీని ఛేదించారు.
software employee
Murder Case
miyapur

More Telugu News