Rakul Preet Singh: నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్‌ పర్సన్‌తో సంబంధం లేదు: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

I have no connection with any political party or political person Rakul Preet Singh

  • ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్న రకుల్‌ 
  • ఇలాంటి పుకార్లను పుట్టించడం బాధాకరం 
  • బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మహిళ ఇలా చేయకూడదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ ఈ కామెంట్స్‌పై పలు అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, స‌మంత‌, ప్రకాశ్ రాజ్, అమ‌ల‌, ఎన్‌టీఆర్, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌, నాగ చైత‌న్య, హీరో నాని, అఖిల్‌, ఖుష్బూలతో పాలు పలువురు సినీ రంగ ప్రముఖులు  ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. 

తాజాగా ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన స్పందనను తెలియజేశారు. "తెలుగు సినీ పరిశ్రమ క్రియేటివిటికి, టాలెంట్‌కి, ఫ్రోఫెషనలిజంకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. నేను ఇలాంటి ఓ గొప్ప తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నందుకు సంతోషంగా వున్నాను. ఇక్కడ నాది ఎంతో అందమైన గొప్ప ప్రయాణం. నాకు ఈ పరిశ్రమతో ఎంతో గొప్ప అనుబంధం వుంది. ఈ రోజున ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గమైన పుకార్లు నాతోటి నటీనటులపై మహిళలపై పుట్టించడం ఎంతో బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలను ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో వున్న మరో మహిళ చేస్తోంది. 

అనవసరమైన పుకార్లకు స్పందించకుండా మౌనంగా ఉండటం అనేది మన బలహీనతగా అనుకుంటారు. నేను పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేని మనిషిని, నాకు ఏ రాజకీయ పార్టీతో, పొలిటికల్‌ లీడర్‌తో సంబంధం లేదు. నా పేరును మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానేయమని కోరుతున్నాను. 

దయచేసి సినిమా తారలను, కళాకారులను రాజకీయ పుకార్ల నుంచి దూరంగా వుంచండి. మా పేర్లకు కల్పిత కథలను జోడించి ప్రచారం చేయకండి.. మీరు హెడ్‌లైన్‌లో వుండటానికి మా మీద ఇలాంటి చవకబారు వ్యాఖ్యలను చేయకండి' అని తన ట్విట్టర్‌ (ఎక్స్‌) అకౌంట్‌లో రాసుకొచ్చారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. గతంలో కొంత మంది రాజకీయ నాయకులు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరును కూడా పలు సందర్భాల్లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 

More Telugu News