Jagga Reddy: రుణమాఫీ ఆలస్యం కావడంపై జగ్గారెడ్డి వివరణ

Jagga Reddy clarification on Loan Waiver

  • డేటా సరిగా లేకపోవడం వల్లే రుణమాఫీ ఆలస్యమవుతోందని వెల్లడి
  • ఇప్పటికే రూ. 18 వేల కోట్లు మాఫీ చేశామన్న జగ్గారెడ్డి
  • ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? అని ప్రశ్న

రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. తాము అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే రుణమాఫీ చేశామని, డేటా సరిగా లేకపోవడంతో మిగిలిన రుణమాఫీ ఆలస్యమవుతోందన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రూ. 18 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. దాచుకోవడానికి ఏమీలేదని, డేటా సరిగా లేకపోవడం వల్లే మిగిలిన రుణమాఫీ కాలేదన్నారు.

రుణమాఫీ జరగలేదని బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో తన ఉనికిని పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే తమ ప్రభుత్వంపై బురద జల్లుతోందన్నారు. విదేశాల నుంచి నల్లధనం తెస్తానని చెప్పిన ప్రధాని మోదీ దానిని తెచ్చారా? అని నిలదీశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, ఆయన చెప్పిన ప్రకారం ఈ 11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని... కానీ, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బీజేపీ ఆ హామీని నెరవేర్చలేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని చెప్పి, రెట్టింపు చేశారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు తులం రూ. 28 వేలుగా ఉన్న బంగారం ఇప్పుడు రూ. 1 లక్షకు పెరిగిందని మండిపడ్డారు. అన్నింటి ధరలు పెంచినా ప్రజలు తమనే గెలిపిస్తున్నారని బీజేపీ వాళ్లకు కళ్లు నెత్తికెక్కాయని ధ్వజమెత్తారు. బీజేపీ వాళ్లలా నటన తమకు రాదని, తాము ప్రాక్టికల్‌గా ఉంటామన్నారు.

  • Loading...

More Telugu News