Helicopter Crash: ముంబై వెళ్తూ పూణె కొండల్లో కూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్లు, ఇంజినీర్ సజీవ దహనం

Two pilots and an engineer killed as Mumbai bound helicopter crashes in Pune hills

  • టేకాఫ్ అయిన మూడునాలుగు నిమిషాలకే కూలిన హెలికాప్టర్
  • పూణె కొండల్లో ఇలాంటి ఘటన ఇది రెండోది
  • దట్టమైన మంచుకు తోడు సాంకేతిక లోపాలే కారణం!

ముంబై వెళ్తున్న ఓ హెలికాప్టర్ పూణె కొండల్లో కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు సహా ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఉదయం 7.50 గంటల సమయంలో జరిగిందీ ఘటన. హెలికాప్టర్ ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్ క్లబ్ నుంచి ముంబైలోని జుహూ విమనాశ్రయానికి వెళ్తుండగా పూణెలోని బవధాన్ ప్రాంతంలో కుప్పకూలింది. కూలిన వెంటనే మంటలు అంటుకోవడంతో అందులోని ఇద్దరు పైలట్లు సహా ఓ ఇంజినీర్ మృతి చెందారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన మూడు నాలుగు నిమిషాల్లోనే ఈ ఘటన జరిగినట్టు తెలిసింది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో దట్టమైన పొంగమంచు కమ్ముకుందని, ప్రమాదానికి ఇదే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

పూణె కొండల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఆగస్టు 24న ఓ ప్రైవేటు హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వెళుతూ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంతకుముందు మే 3న శివసేన (యూబీటీ) నాయకురాలు సుష్మా అంధారేను తీసుకొచ్చేందుకు వెళ్తున్న చాపర్ రాయిగఢ్‌లోని హెలిపాడ్ సమీపంలో కూలింది. 

తాజా ఘటనపై బీజేపీ నేత, మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ సాంకేతిక కారణాలతోపాటు, దారి కనిపించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని, దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. కాగా, ఇదే హెలికాప్టర్‌లో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తాత్కరే వెళ్లాల్సి ఉందని తెలిసింది. హెలికాప్టర్ కుప్పకూలిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏవియేషన్ అధికారులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News