Picasso portrait: అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసింది పికాసో చిత్రమని నిర్ధారణ.. దాని విలువ ఎంతో తెలుసా?

A junk dealers discovery in a Capri cellar has turned out to be an original Picasso portrait

  • ఇటలీలో 1962లో తక్కువ ధరకే పెయింటింగ్‌ను కొనుగోలు చేసిన డీలర్
  • దశాబ్దాల పాటు ఇంట్లో గోడకు వేలాడదీసిన వైనం
  • పెయింటింగ్‌పై సంతకం గమనించి ఆరా తీసిన కొడుకు
  • పికాసో చిత్రంగా నిర్ధారణ.. భారీ ధర పలకనున్న పెయింటింగ్

ఇటలీలో సెకండ్ హ్యాండ్ వస్తువులు సేకరించి విక్రయించే ఓ ‘జంక్ డీలర్’ కుటుంబం పంట పండింది. కాప్రి పట్టణంలో చాలా ఏళ్లక్రితం ఓ సెల్లార్‌లో లభించిన ఓ కళాఖండం ప్రసిద్ధ చిత్రకారుడు పికాసో గీసిన ఒరిజినల్ పెయింటింగ్ అని నిర్ధారణ అయింది. 1962లో దొరికిన ఈ పెయింటింగ్  విలువ ప్రస్తుతం రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనాగా ఉంది.

లుయిగి లో రోస్సో అనే డీలర్‌కు 1962లో ఈ పెయింటింగ్‌ లభ్యమైందని, కొంతమొత్తం వెచ్చించి దీనిని కొనుగోలు చేశారని ‘ది గార్డియన్’ కథనం పేర్కొంది. రోస్సో ఈ పెయింటింగ్‌ను పోంపీలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. భార్యకు నచ్చకపోయినప్పటికీ దానిని తన గదిలో గోడకు వేలాడదీశాడు. కొన్ని దశాబ్దాలపాటు అది అలాగే ఉంది.

రోస్సో కొడుకు ఆండ్రియా కళలకు సంబంధించిన చరిత్రను అధ్యయనం చేయడం మొదలుపెట్టడంతో ఈ పెయింటింగ్‌ గుర్తింపులో కీలక మలుపు అయింది. పెయింటింగ్ ఎగువ భాగంలో ఎడమ వైపు మూలన ఉన్న ప్రత్యేక సంతకాన్ని అతడు గుర్తించాడు. మిస్టరీగా ఉన్న సంతకం ఎవరిదో తెలుసుకునేందుకు ప్రముఖ ఆర్ట్ డిటెక్టివ్ మౌరిజియో సెరాసినితో పాటు పలువురు నిపుణుల బృందాన్ని సలహా కోరాడు. పెయింటింగ్‌ను నిశితంగా పరిశీలించిన గ్రాఫాలజిస్ట్, ఆర్కాడియా ఫౌండేషన్ శాస్త్రీయ కమిటీ సభ్యుడు సిన్జియా అల్టియెరి ఈ కళాఖండం పికాసో చిత్రమని నిర్ధారించారు. పెయింటింగ్ శైలి ఆధారంగా గుర్తించినట్టు చెప్పారు. ఈ కళాఖండం విలువ ప్రస్తుతం 5 మిలియన్ పౌండ్లు, అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 55.71 కోట్లు వరకు ఉంటుందని చెప్పారు.

పెయింటింగ్‌ నిర్ధారణకు సంబంధించిన ఇతర పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత సంతకం పరిశీలించాలని తనను కోరారని, నిర్ధారణ కోసం నెలల తరబడి పనిచేసినట్టు అల్టీరి చెప్పారు. కొన్ని రచనలతో పోల్చానని, ఈ చిత్రంపై ఉన్న సంతకం పికాసోదేనని అనడంలో సందేహం లేదని, ఇది అసత్యమని సూచించే ఆధారాలు ఏవీ లేవని అన్నారు. 

కాగా 1962లో తక్కువ ధరకు ఈ పెయింటింగ్‌ను కొనుగోలు చేసిన తండ్రి లో రాస్ చనిపోయాడని ఆండ్రియా వెల్లడించాడు. ఈ పెయింటింగ్‌ అసహ్యకరంగా ఉందని, పడేయాలంటూ అమ్మ చెబుతుండేవారని, అయితే నాన్న జ్ఞాపకంగా ఉంచానని ఆయన వివరించారు. కాగా పికాసో ప్రియురాలు, ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్, పెయింటర్ అయిన డోరా మార్ చిత్రంగా భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News