Russian Jet: అమెరికా గగనతలంలోకి రష్యా యుద్ధ విమానం.. వైరల్ వీడియో

Russian fighter jet intercepted near Alaska

  • సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్న ఫైటర్ జెట్ పక్క నుంచి దూసుకెళ్లిన వైనం
  • ఎఫ్ - 16 జెట్ ను పంపి రష్యా యుద్ధ విమానాన్ని తరిమిన అమెరికా
  • రష్యా ఎంబసీకి సమాచారం అందించి అసంతృప్తి వ్యక్తం చేసిన యూఎస్ ఎయిర్ ఫోర్స్

రష్యా యుద్ధ విమానం ఒకటి అమెరికా గగనతలంలోకి దూసుకు వచ్చింది. సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న అమెరికా ఫైటర్ జెట్ పక్క నుంచి వేగంగా వెళ్లిపోయింది. రష్యా విమానం అత్యంత సమీపంలోకి రావడంతో అమెరికా పైలట్ తన జెట్ ను ఓ పక్కకు వంచడం వీడియోలో కనిపిస్తోంది. ఈ నెల 23న నార్తర్న్‌ అమెరికన్‌ ఏరోస్పేస్‌ కమాండ్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. రష్యా యుద్ధ విమానాన్ని తరిమికొట్టేందుకు ఎఫ్ - 16 ఫైటర్ జెట్ ను ప్రయోగించాల్సి వచ్చిందని తెలిపారు. దీనిపై అమెరికా వాయుసేన ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రష్యన్ ఎంబసీకి సమాచారం అందించారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.

ఏరోస్పేస్ కమాండ్ చీఫ్ జనరల్ గ్రెగరీ గ్యూలాంట్ ఈ ఘటనపై స్పందిస్తూ.. రష్యాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానం తమ ఫైటర్ జెట్ కు అత్యంత సమీపంలోకి వచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా రష్యా పైలట్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని మండిపడ్డారు. అమెరికా గగనతలంపైకి వచ్చిన రష్యన్ యుద్ధ విమానాన్ని ఎఫ్ - 16 ఫైటర్ జెట్ తో తరిమికొట్టినట్లు తెలిపారు. కాగా, రష్యన్ యుద్ధ విమానాలు ఇటీవలి కాలంలో అమెరికా వైపు దూసుకు రావడం ఇది తొమ్మిదో ఘటన. ఎనిమిది రష్యా ఫైటర్ జెట్లు, నాలుగు యుద్ధ నౌకలు, రెండు సబ్ మెరీన్లు అమెరికా వైపు దూసుకొచ్చాయి. రష్యన్ యుద్ధ నౌకలు అమెరికా సముద్ర సరిహద్దును దాటి 30 మైళ్లు లోపలికి వచ్చినట్లు గ్యూలాంట్ తెలిపారు. జులైలో రష్యా, చైనా బాంబర్‌ విమానాలు అలాస్కా గగనతలానికి అత్యంత సమీపంలో ప్రయాణించాయని అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ చెప్పారు.

  • Loading...

More Telugu News