Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి కీలక ప్రకటన

Karnataka CM Siddaramaiah wife Parvathi announced that she would return the 14 compensatory land sites

  • ముడా నుంచి పొందిన భూములను తిరిగి ఇచ్చేస్తానని ప్రకటన
  • మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి లేఖ రాసిన సీఎం భార్య పార్వతి
  • తన భర్త గౌరవం కంటే ఏదీ ఎక్కువ కాదని ప్రకటన
  • ఆమె ప్రకటనను స్వాగతిస్తున్నట్టు తెలిపిన సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్న ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదైన గంటల వ్యవధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) నుంచి తాను పొందిన 14 పరిహార భూములను తిరిగి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ముడాకు ఆమె లేఖ రాశారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

తన భర్త, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో కఠినమైన నైతిక నిబంధలను పాటించారని, ఎలాంటి మచ్చ లేకుండా నడుచుకున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. ‘‘ నా భర్త సిద్ధరామయ్య రాజకీయ జీవితానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను జీవించాను. నా భర్త కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు’’ అని లేఖలో ఆమె పేర్కొన్నారు.

కాగా భూముల కేటాయింపునకు సంబంధించిన ముడా స్కామ్‌లో పార్వతిపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై కూడా ఆమె స్పందించారు. తన వ్యక్తిగత సంపద లేదా ఆస్తి కోసం ఎప్పుడూ తాను వెతకలేదని అన్నారు. తన భర్త ప్రజల గౌరవాన్ని పొందడం తనకు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త గౌరవానికి మించిన భౌతిక సంపద ఏదీ లేదని వ్యాఖ్యానించారు. ఇక ఆస్తులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్న తన భార్య నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య కూడా ప్రకటించారు.

కాగా సీఎం సిద్ధారామయ్యతో పాటు మరికొందరిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ల కింద కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) దాఖలు చేసింది. ఈసీఐఆర్ అంటే పోలీసు ఎఫ్ఐఆర్‌తో సమానమని ఈడీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News