APSRTC: దసరా సీజన్ వచ్చేస్తోంది.... స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ

apsrtc to run special buses for dussehra festival
  • దసరా సందర్భంగా అక్టోబర్ 4 నుండి 20వ తేదీ వరకూ 6,100 ప్రత్యేక బస్సులు   
  • ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్న ఆర్టీసీ
దసరా పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. పండుగ నేపథ్యంలో 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలోని ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 4నుండి 20వ తేదీ వరకూ మొత్తం 6,100 సర్వీసులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. 
 
అక్టోబర్ 4 నుంచి 11 వరకూ దసరా ముందు 3,040 ప్రత్యేక బస్సులు, అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకూ దసరా తర్వాత మరో 3,060 బస్సులు నడపనున్నట్లు తెలిపింది. అయితే, ప్రయాణికులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ చార్జీలనే వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. అంతే కాకుండా ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంతో పాటు రానుపోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో పది శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ చార్జీలపై పది శాతం రాయితీ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలియజేసింది.
APSRTC
Special Buses
Dussehra Festival

More Telugu News