Tirupati Laddu Row: తిరుపతి లడ్డూ కల్తీ అంశంలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు... హైకోర్టును ఆశ్రయించిన సంస్థ ఎండీ
- జాతీయస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం
- కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ టీటీడీ ఫిర్యాదు
- ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన ఏఆర్ డెయిరీ ఎండీ
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న అంశంలో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థపై తిరుపతిలో కేసు నమోదైంది. కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ టీటీడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని కోరుతూ, ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
నెయ్యి శాంపిల్స్ ను విశ్లేషించడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నిర్దేశించిన నిబంధనలను అనుసరించలేదని తన పిటిషన్ లో ఆరోపించారు. ముందస్తు బెయిల్ మంజూరు కోసం ఎలాంటి షరతులు విధించినా కట్టుబడి ఉంటానని రాజశేఖరన్ పేర్కొన్నారు. రాజశేఖరన్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.