Rajnath Singh: పాక్ మనతో స్నేహపూర్వకంగా ఉంటే ఆ దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే వాళ్లం: రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Rajnath Singhs Jibe At Pakistan Asking For IMF Package

  • మాతో స్నేహంగా ఉంటే మేమే ఆదుకునే వాళ్లమన్న రక్షణ మంత్రి
  • ఐఎంఎఫ్ ప్యాకేజీ కన్నా పెద్ద మొత్తం ఇచ్చేవాళ్లమని వెల్లడి
  • ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు కలిగి ఉండాలని పాక్ కు హితవు

స్నేహితులను మార్చుకోగలం కానీ ఇరుగుపొరుగును మార్చుకోలేమంటూ మాజీ ప్రధాని వాజ్ పేయీ చెప్పేవారని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గుర్తుచేశారు. ఆదివారం జమ్మూ కశ్మీర్ లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్, భారత్ సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్.. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ని ఆర్థిక సాయం కోసం అడుగుతోందని చెప్పారు. భారత్ తో సత్సంబంధాలు కలిగి ఉంటే పాక్ ను తామే ఆదుకునే వాళ్లమని చెప్పారు. ఐఎంఎఫ్ ను పాక్ అడిగిన ప్యాకేజీ కన్నా కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి కేటాయించిన ప్యాకేజీ ఎక్కువని తెలిపారు. పాక్ మనతో స్నేహపూర్వకంగా ఉంటే ఆ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించే వాళ్లమని వివరించారు. 

పాకిస్థాన్ తో సత్సంబంధాలు నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను మానుకొమ్మని, ఉగ్రవాదులను ప్రోత్సహించవద్దని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు గతంలో ఇతర ప్రభుత్వాలు కూడా పాక్ కు సూచించాయని రాజ్ నాథ్ తెలిపారు. అయితే, ఈ సూచనలను పాక్ పాలకులు ఏనాడూ పట్టించుకోలేదని, ప్రజా సంక్షేమాన్ని కూడా ఫణంగా పెట్టి ఉగ్రవాదులకు అండగా నిలిచారని ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఇప్పటికీ పెంచిపోషిస్తోందని పాక్ పై మండిపడ్డారు. అయితే, మోదీ నేతృత్వంలో భారత్ సరికొత్త దేశంగా అవతరించిందని, మన భూభాగంపై సరిహద్దుల అవతలి నుంచి ఎవరైనా దాడులు చేస్తే బార్డర్ దాటి వెళ్లి దీటుగా జవాబిచ్చి వచ్చే సత్తా భారత్ కు ఉందని చెప్పారు. పాక్ పాలకులు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News