Narendra Modi: కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ప్రధాని మోదీ ఫోన్

Narendra Modi spoke to Congress chief Mallikarjun Kharge after he fell ill

  • ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ప్రధాని
  • జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో అస్వస్థతకు గురైన ఖర్గే
  • ప్రస్తుతం బాగానే ఉన్నారని ప్రకటించిన ఆయన కొడుకు ప్రియాంక్ ఖర్గే

జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేశారు. ఆదివారం ఖర్గేతో మాట్లాడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కాగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ ప్రచారంపర్వం ముగిసింది. చివరి రోజైన ఆదివారం కథువాలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ప్రసంగిస్తున్న సమయంలో మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్పృహ కోల్పోయినట్లు కనిపించింది. పక్కనే ఉన్న ఆయన భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు వెంటనే గమనించి నీళ్లు తాగించారు. కాస్త తేరుకున్న తర్వాత ఖర్గే తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు.

ఖర్గే ఆరోగ్య పరిస్థితిపై ఆయన కొడుకు, కర్ణాటకలోని చిత్తాపూర్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ ఇచ్చారు. బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, వైద్య బృందం పరిశీలించిందని, కాస్త తక్కువ రక్తపోటుకు(Low BP) గురయ్యారని, ఇప్పుడు బాగానే ఉన్నారని చెప్పారు. ప్రజల ఆశీస్సులు ఆయన సంకల్పాన్ని దృఢంగా ఉంచుతున్నాయని వ్యాఖ్యానించారు.

కాగా మల్లికార్జున ఖర్గే ప్రస్తుత వయసు 83 సంవత్సరాలు. జమ్మూకశ్మీర్‌లో అస్వస్థతకు గురైన తర్వాత ప్రసంగిస్తూ.. అంత త్వరగా చనిపోనని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించే వరకు క్రియాశీలకంగా పనిచేస్తానని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం పోరాడుదామని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించలేదని, వాళ్లు భావించి ఉంటే కనుక రెండేళ్లపాటు పెట్టేవారని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత ఎన్నికలకు సిద్ధమయ్యారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News