Jaishankar: పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- సీమాంతర ఉగ్రవాదం విధానం ఎన్నటికీ విజయవంతం కాదని వెల్లడి
- దాని ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరిక
- పీవోకే నుంచి పాక్ బలగాలు వెళ్లిపోతే అన్ని సమస్యలకూ పరిష్కారం
పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృతాపరాధమేనని, కర్మ ఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించాల్సిందేనని అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధానం ఎన్నటికీ విజయవంతం కాబోదని జోస్యం చెప్పారు. ఈమేరకు ఐక్యారాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ లో జైశంకర్ ప్రసంగించారు. జమ్మూకశ్మీర్ పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను జైశంకర్ ఖండించారు.
పీవోకే సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం లభించదని, అక్కడి నుంచి పాక్ బలగాలు వెళ్లిపోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని తేల్చిచెప్పారు. పొరుగు దేశాలపై పాక్ ప్రయోగిస్తున్న సీమాంతర ఉగ్రవాదం ఇప్పుడు ఆ దేశంపైన కూడా ప్రభావం చూపిస్తోందని జైశంకర్ అన్నారు. దీని ఫలితమే పాక్ లో కనీవినీ ఎరగని ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతులలోనే జీడీపీని కొలవాలని అన్నారు.