Gold saree: ఇది రూ.18 లక్షల ఖరీదైన చీర
- అద్భుత కళాకృతిని ఆవిష్కరించిన సిరిసిల్ల చేనేత కార్మికుడు విజయ్ కుమార్
- 200 గ్రాముల పసిడితో బంగారు చీర తయారీ
- హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపార వేత్త కుమార్తె వివాహానికి ఈ చీర తయారీ చేసిన విజయకుమార్
కొందరు వారి పిల్లల వివాహా వేడుకలను పది కాలాల పాటు గుర్తుండిపోయేలా నిర్వహిస్తూ ఉంటారు. ఇందు కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వివాహ వేదిక మొదలుకొని ఆభరణాలు, వస్త్రాల కొనుగోలు, ఇతర ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉండేందుకు లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తుంటారు. అదే కోవలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమార్తె వివాహానికి బంగారంతో చీర తయారు చేయాలని భావించాడు.
ఆ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్‌ను ఆ వ్యాపారవేత్త సంప్రదించాడు. దీంతో అతను అద్భుత కళాకృతిని ఆవిష్కరించాడు. 200 గ్రాముల పసిడితో బంగారు చీర తయారు చేసి అందరి దృష్టిని విజయ్ కుమార్ ఆకర్షించాడు. సదరు వ్యాపారవేత్త కుమార్తె వివాహం అక్టోబర్ 17న జరగనుండగా, ఆరు నెలల క్రితమే బంగారు చీర తయారీకి ఆర్డర్ ఇచ్చారు.
200 గ్రాముల బంగారంతో చీర తయారు చేసి అరుదైన రికార్డు సృష్టించిన విజయ్ కుమార్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. బంగారాన్ని జరీ తీయడానికి కొత్త డిజైన్ తయారు చేయడానికి పది నుండి 12 రోజులు పట్టిందని తెలిపాడు. ఈ చీర 49 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు, బరువు 800 నుండి 900 గ్రాములు ఉంటుందని చెప్పాడు. ఈ చీరను రూ.18లక్షల వ్యయంతో తయారు చేసినట్లుగా విజయ్ కుమార్ తెలిపారు. బంగారంతో చీర తయారు చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని విజయ్ కుమార్ పేర్కొన్నాడు.