Musheer Khan: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ క్రికెటర్ ముషీర్ ఖాన్!
- యూపీలో రోడ్డు ప్రమాదానికి గురైన యంగ్ క్రికెటర్
- కాన్పూర్ నుంచి లక్నోకు వెళుతున్న సమయంలో ప్రమాదం
- ఇరానీ కప్ కోసం తన తండ్రి నౌషాద్ ఖాన్‌తో కలిసి వెళుతుండగా దుర్ఘటన
- ఇటీవల దులీప్ ట్రోఫీలో భారీ సెంచరీతో ఆకట్టుకున్న ముషీర్
టీమిండియా ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు తెలుస్తోంది. ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుంచి లక్నోకు తన తండ్రి కమ్ కోచ్ నౌషాద్ ఖాన్‌తో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఇక ఎంతో ప్రతిభావంతుడైన యంగ్ ప్లేయర్ ముషీర్ ఖాన్ ఇటీవల దులీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఇండియా-సీ జట్టు తరపున బరిలోకి దిగిన అతడు ఇండియా-ఏపై భారీ శతకం (181 పరుగులు) బాదాడు.
ఈ ప్రమాదం కారణంగా 19 ఏళ్ల ముషీర్ ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఇరానీ ట్రోఫీలో ఆడటం అనుమానంగా మారింది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1-5 మధ్య ఇరానీ కప్ మ్యాచ్ జరగనుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో ముంబై ఈ మ్యాచ్ ఆడనుంది. ముంబైలో జట్టులో ఉన్న ఈ యువ ఆల్‌రౌండర్ ఇప్పుడు రంజీ ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
ప్రమాదంలో అతని మెడపై తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో మూడు నెలల పాటు ముషీర్ ఇంటి నుంచి బయటికి వచ్చే అవకాశం లేదని సమాచారం.
"అతను ఇరానీ కప్ కోసం ముంబై జట్టుతో కలిసి లక్నోకు వెళ్లాడు. ప్రమాదం జరిగినప్పుడు ముషీర్ వ్యక్తిగత పనుల కోసం బహుశా అజంగఢ్ నుండి తన తండ్రితో కలిసి లక్నోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది" అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇక అక్టోబర్‌లో ఇండియా-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత యువ జట్టు రెండు మ్యాచులు ఆడనుంది. ఈ పర్యటనకు దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ మ్యాచ్ ఆధారంగా ఇండియా-ఏ జట్టు ఎంపిక ఉండనుంది. దీంతో దులీప్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ముషీర్.. ఇరానీ మ్యాచ్‌లో కూడా రాణించి ఇండియా-ఏలో చోటు సంపాదించాలని చూశాడు. కానీ, ఇప్పుడు ఈ ప్రమాదం కారణంగా మొదటికే మోసం వచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన అతడు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. దాంతో సెలక్షన్‌పై అతడి ఆశలు ఆవిరైనట్లే.