Pawan Kalyan: ఈ కార్యక్రమం పండుగలా జరగాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

deputy cm pawan kalyan review on panchayati raj and rural development departments

  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష 
  • అన్ని గ్రామ పంచాయతీల్లో అక్టోబర్ 14 నుంచి వారం రోజుల పాటు పనులను ప్రారంభించాలని సూచించిన పవన్ 
  • వెబ్ సైట్, డ్యాష్ బోర్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి 

అక్టోబర్ 14వ తేదీ నుంచి ప్రతి పంచాయతీలో అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని, 20వ తేదీ వరకూ వారం రోజుల పాటు పనుల ప్రారంభోత్సవాన్ని ఒక పండుగలా నిర్వహించాలని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. 

15వ ఆర్ధిక సంఘం నిధులతో చేపట్టే పనుల ప్రారంభం గురించి సమావేశంలో చర్చించారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన మొదటి వంద రోజుల్లోనే 15వ ఆర్ధిక సంఘం నుంచి రూ.1987 కోట్లు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.4500 కోట్ల నిధులు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిందని, దీంతో గ్రామ పంచాయతీలకు నిధుల సమస్య లేదన్నారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ పనులు ప్రారంభించే కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

ఒక వేడుకలా ఈ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల గ్రామాల్లో తమకు వచ్చిన నిధులు, వాటితో చేసే పనులపై ప్రజలకు సమాచారం ఉంటుందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, తనిఖీలు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వెబ్ సైట్, డ్యాష్ బోర్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్. కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు. 
.

  • Loading...

More Telugu News