Ravichandran Ashwin: అశ్విన్ మ‌రో అరుదైన ఫీట్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌!

R Ashwin Continues Stunning Run Breaks Anil Kumble Mammoth Test Record

  • కాన్పూర్ వేదిక‌గా భార‌త్‌, బంగ్లా రెండో టెస్టు
  • టెస్టుల్లో ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌల‌ర్‌గా అశ్విన్
  • అశ్విన్ టెస్టుల్లో 420 వికెట్లు పడగొట్టి అగ్రస్థానం
  • 419 వికెట్లతో లెజెండ‌రీ స్పిన్న‌ర్‌ అనిల్ కుంబ్లే రెండో స్థానం

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ శుక్రవారం మ‌రో అరుదైన‌ ఫీట్ న‌మోదు చేశాడు. అతను టెస్టుల్లో ఆసియాలో అత్యధిక వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌల‌ర్‌గా నిలిచాడు. కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న‌ రెండో టెస్టు మ్యాచ్‌లో ఈ ఘ‌న‌త సాధించాడు. 

మొదటి రోజు ఆటలో భాగంగా 29వ ఓవర్‌లో బంగ్లా కెప్టెన్‌ నజ్ముల్ హొస్సేన్ శాంటోను పెవిలియ‌న్ పంపించ‌డం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. ప్ర‌స్తుతం ఆసియాలో అశ్విన్ టెస్టుల్లో 420 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో కొన‌సాగుతున్నాడు. 

కాగా, గ‌తంలో ఈ రికార్డు 419 వికెట్లతో భార‌త మ‌రో లెజెండ‌రీ స్పిన్న‌ర్‌ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. ఇప్పుడు కుంబ్లే రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ‌రో దిగ్గ‌జ స్పిన్న‌ర్‌ హర్భజన్ సింగ్ 300 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 

కాగా, 2011లో వెస్టిండీస్‌పై అశ్విన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 101 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన 38 ఏళ్ల ఈ స్పిన్ ఆల్‌రౌండ‌ర్‌ 522 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

ఇదిలాఉంటే.. కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత పేసర్ ఆకాశ్ దీప్   బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్ (0), షాద్‌మన్ ఇస్లాం (24)  వికెట్లు పడగొట్టి భార‌త్‌కు శుభారంభం ఇచ్చాడు. అయితే, రెండు వికెట్లు త్వ‌ర‌గా కోల్పోయిన తర్వాత మోమినుల్ హక్ (40 నాటౌట్‌), నజ్ముల్ హొస్సేన్ శాంటో (31) బంగ్లా ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దారు. 

రెండవ సెషన్ మధ్యలో వర్షం అంత‌రాయం క‌లిగించ‌డంతో ఆట రద్దు అయింది. శుక్రవారం కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 107/3తో నిలిచింది. మోమినుల్ హక్ (40), ముష్ఫికర్ రహీమ్ (6) క్రీజులో ఉన్నారు. ఇక ఇప్ప‌టికే రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో రోహిత్ సేన మొద‌టి మ్యాచ్‌లో గెలుపుతో 1-0తో ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News