Kamindu Mendis: 30 ఏళ్లుగా అలాగే ఉన్న వినోద్ కాంబ్లీ రికార్డును బద్దలుకొట్టిన శ్రీలంక ఆటగాడు
- కేవలం 13 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న కమిందు మెండిస్
- 14 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన వినోద్ కాంబ్లీ రికార్డును బ్రేక్ చేసిన శ్రీలంక యువ క్రికెటర్
- వేగంగా వెయ్యి పరుగులు అందుకున్న ఉపఖండ ఆటగాడిగా ఘనత
శ్రీలంక యువ కెరటం, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కమిందు మెండిస్ టెస్టుల్లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కేవలం ఎనిమిది టెస్టు మ్యాచ్‌లలోనే 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. గాలే వేదికగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఇవాళ (శుక్రవారం) కెరీర్‌లో మూడవ టెస్ట్ సెంచరీతో ఈ మైలురాయిని గ్రాండ్‌గా చేరుకున్నాడు. కమిందు రెండేళ్ల క్రితం గాలే మైదానంలోనే అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి 8 మ్యాచ్‌లు ఆడగా.. 13 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. అద్భుతమైన సగటుతో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తనకంటే ముందు 13 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్న ఆస్ట్రేలియన్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును కమిందు సమం చేశాడు.
కాగా 14 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసి ఇంతకాలం రెండవ స్థానంలో ఉన్న భారత మాజీ బ్యాటర్ వినోద్ కాంబ్లీ రికార్డును కమిందు బద్దలుకొట్టాడు. కాంబ్లీ 1994లో ఈ ఘనతను సాధించాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత దానిని శ్రీలంక బ్యాటర్ ఇప్పుడు బద్దలుకొట్టాడు.
టెస్టుల్లో వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఉపఖండ బ్యాటర్‌గా కమింద్ నిలిచాడు. కాగా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు సట్‌క్లిఫ్, వెస్టిండీస్ మాజీ ప్లేయర్ ఎవర్టన్ వీక్స్ ఇద్దరూ 12 ఇన్నింగ్స్‌లలో ఈ వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నారు.