China: సముద్రంలో మునిగిపోయిన చైనా న్యూక్లియర్ సబ్‌మెరైన్!

china newest nuclear powered attack submarine sank earlier this year says Reports

  • మే-జూన్ మధ్య మునిగిపోయిందన్న అమెరికా రక్షణశాఖ సీనియర్ అధికారి
  • శిక్షణ ప్రమాణాలు, పరికరాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేసిన అధికారి
  • అలాంటి సమాచారం తమ వద్ద లేదన్న వాషింగ్టన్‌లోని చైనా రాయబారి

చైనాకు చెందిన అణుశక్తి సామర్థ్యం కలిగిన అత్యాధునిక జలాంతర్గామి ఒకటి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఏడాది తొలి నాళ్లలో మునిగిపోయిందని అమెరికా రక్షణ శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు. చైనా తన సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటున్న క్రమంలో జరిగిన ఈ పరిణామం ఆ దేశాన్ని కాస్త ఇబ్బందిపెట్టేదేనని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా రక్షణశాఖకు చెందిన మరో సీనియర్ అధికారి మాట్లాడుతూ... చైనాకు చెందిన సరికొత్త న్యూక్లియర్-పవర్డ్ అటాక్ సబ్‌మెరైన్ మే-జూన్ మధ్య కాలంలో మునిగిపోయిందని చెప్పారు. చైనా జలాంతర్గామి మునిగిపోవడానికి కారణమేమిటి, ఆ సమయంలో అణు ఇంధనం ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదని ఆయన వివరించారు.

శిక్షణ ప్రమాణాలు, పరికరాల నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేశారు. జలాంతర్గామి మునిగిపోవడంతో పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అంతర్గత జవాబుదారీతనం, రక్షణ పరిశ్రమ పర్యవేక్షణపై లోతైన ప్రశ్నలను లేవనెత్తుతోందని అన్నారు. చైనా చాలా కాలంగా అవినీతితో బాధపడుతోందని ఆయన ప్రస్తావించారు. జలాంతర్గామి మునిగిపోయిన విషయాన్ని పీఎల్ఏ రహస్యంగా దాచిపెట్టడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.

కాగా జలాంతర్గామి మునిగిపోవడంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు. ‘‘మీరు చెబుతున్న అంశం గురించి మాకు తెలియదు. చెప్పడానికి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు.

కాగా 370 నౌకలతో ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళాన్ని కలిగి ఉన్న దేశంగా చైనా కొనసాగుతోంది. కొత్త తరం అణ్వాయుధ జలాంతర్గాములను ఉత్పత్తి చేసుకోవడంపై ఆ దేశం దృష్టిసారించింది.

  • Loading...

More Telugu News