KTR: చిట్టీ... అవి రాత్రికి రాత్రే పుట్టుకు వచ్చాయా?: కేటీఆర్
- మూసీ నది సాక్షిగా లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టామన్న కేటీఆర్
- తాము నిర్మిస్తే... మీరు కూల్చివేస్తున్నారని విమర్శ
- అధికారులు మీ టేబుల్ ముందు పెట్టిన డబుల్ లెక్కలు చూసి మతిపోతుందా? అన్న కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, మరి మూసీ నది సాక్షిగా హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు రాత్రికి రాత్రే పుట్టుకు వచ్చాయా చిట్టీ...! అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించామన్నారు. తాము నిర్మిస్తే మీరు కూల్చేస్తున్నారని విమర్శించారు. తమది నిర్మాణమైతే... మీది విధ్వంసమని మండిపడ్డారు.
లక్షల నిర్మాణాలు మావి అయితే... లక్షల కూల్చివేతలు మీవని ధ్వజమెత్తారు. మూసీ నది సాక్షిగా మహానగరంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ళు ఇవేనని ఫోటోలను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ విష ప్రచారాలు, అబద్ధాలు చెబుతున్నారనడానికి ఇది మరో సాక్ష్యమన్నారు. తాము డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టలేదని మభ్యపెట్టారని, మరి లక్ష ఇళ్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.
కాంగ్రెస్ పాలనలో మీ అధికారులే మీ టేబుల్ ముందు పెట్టిన ఇళ్ల లెక్కలు చూసి మతిపోతోందా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిజం... ఆయన హామీలు నిజం... ఆయన మాట నిజమని తెలిసి మింగుడు పడటం లేదా? అన్నారు.
మీ జూటా మాటలు, కుట్రలకు... మీ దిమాక్ తక్కువ పనుల డ్యామేజ్ కంట్రోల్‌కు ఈరోజు కేసీఆర్ గారి నిర్మాణాలే దిక్కయ్యాయన్నారు. కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు నిజం... కేటాయింపులు నిజమే అన్నారు. మీ నాలుకలు తాటి మట్టలు కాకుంటే మరోసారి అబద్ధాలు మాట్లాడవద్దని హితవు పలికారు.