Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం వేళ ప్రయాగ్‌రాజ్‌లోని ఆలయాలు అనూహ్య నిర్ణయం

Prayagraj have banned devotees from bringing sweets and other processed items for offerings

  • ఆలయాల్లో స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఇతర ఆహార పదార్థాలు సమర్ఫించకుండా నిషేధం
  • కొబ్బరికాయలు, పండ్లు తీసుకురావాలని సూచన
  • తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని నిర్ధారణ కావడంతో హిందూ సమాజం, ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ వ్యవహారం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఆలయాల పాలకులు కీలకమైన ప్రకటన చేశారు. 

ప్రసాదంగా స్వీట్లు, ప్రాసెస్ చేసిన ఇతర ఆహార పదార్థాలను భక్తులు తీసుకురావొద్దంటూ నిషేధం విధించారు. స్వీట్లకు బదులుగా కొబ్బరికాయలు, పండ్లు సమర్పించాలని సూచించారు. ఈ ఆంక్షలు విధించిన ఆలయాల జాబితాలో ఆలోప్ శంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్‌తో పాటు నగరంలోని అనేక ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. 

పూజారులు ఏమన్నారంటే...

భక్తులు స్వీట్లు సమర్పించకుండా విధించిన నిషేధంపై ప్రయాగ్‌రాజ్‌లోని ప్రఖ్యాత లలితా దేవి ఆలయ ప్రధాన అర్చకుడు శివ్ మురత్ మిశ్రా మాట్లాడారు. మంగళవారం జరిగిన ఆలయ నిర్వాహకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. 

ఆలయంలో కొలువై ఉన్న అమ్మవారికి స్వీట్లను ప్రసాదంగా ఇవ్వకూడదని నిర్ణయించామని, అయితే భక్తులు కొబ్బరికాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, యాలకులు వంటి వాటిని సమర్పించవచ్చునని సూచించారు. ఇక భక్తులకు స్వచ్ఛమైన స్వీట్లు అందుబాటులో ఉండేలా ఆలయ ప్రాంగణంలో దుకాణాలను తెరిచే యోచన చేస్తున్నట్టు వివరించారు.

తిరుపతి వివాదం నేపథ్యంలో బయట నుంచి భక్తులు తీసుకొచ్చే మిఠాయి ప్రసాదాలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు ఆలోప్ శాంకరీ దేవి ఆలయ ప్రధాన పోషకుడు, శ్రీ పంచాయతీ అఖారా మహానిర్వాణి కార్యదర్శి యమునా పురి మహారాజ్ తెలిపారు. ఇక, మంకమేశ్వర్ ఆలయానికి చెందిన మహంత్ శ్రీధరానంద బ్రహ్మచారి స్పందిస్తూ... ఆలయం వెలుపల దుకాణాల్లో లభించే లడ్డూను పరీక్షించాలంటూ జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News