paracetamol: నాణ్యత పరీక్షలో 53 ఔషధాలు ఫెయిల్... జాబితాలో పారాసిటమాల్

Over 53 drugs have failed quality tests of Central Drugs Standards Control Organisation

  • సీడీఎస్సీవో పరిశీలనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు
  • నాణ్యత పరీక్షలో ఏకంగా 53 ఔషధాలు విఫలం
  • జాబితాలో బీపీ, డయాబెటిక్ టాబ్లెట్స్

భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) పరిశీలనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నాణ్యత పరీక్షలో ఏకంగా 53 ఔషధాలు విఫలమయ్యాయి. ఈ జాబితాలో పారాసిటమాల్‌తో పాటు కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్లు, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, హైబీపీ మందులు ఉన్నాయి. ఈ మేరకు నెలవారీ ‘నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ (ఎన్ఎస్‌క్యూ) అలర్ట్ జాబితాలో ఈ ఔషధాల పేర్లను సీడీఎస్సీవో ప్రకటించింది. రాష్ట్ర ఔషధ అధికారులు నెలవారీగా యాదృచ్ఛికంగా సేకరించే నమూనాల నుంచి ఈ నాణ్యతా పరీక్షలు చేసినట్టు వివరించింది. 

క్వాలిటీ టెస్టులో విఫలమైన మరికొన్ని ఔషధాల జాబితాలో విటమిన్ సీ, డీ3 టాబ్లెట్స్ షెల్కాల్, విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, యాంటీ యాసిడ్ పాన్-డీ, పారాసిటమాల్ ఐపీ 500 ఎంజీ, యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమెపిరైడ్, హైబీపీ ఔషధం టెల్మిసార్టన్‌ ఉన్నాయి. ఈ ఔషధాలను హెటిరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్‌తో పాటు మరి కొన్ని కంపెనీలు తయారుచేస్తున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వరంగ సంస్థ అయిన హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఉత్పత్తి చేసే మెట్రోనిడాజోల్ కూడా నాణ్యత పరీక్షల్లో విఫలమైన ఔషధాల జాబితాలో ఉంది. పొట్ట ఇన్ఫెక్షన్ల చికిత్సలో విస్తృతంగా దీనిని ఉపయోగిస్తుంటారు. ఆల్కెమ్ హెల్త్ సైన్స్ తయారు చేసే యాంటీబయాటిక్స్ ‘క్లావమ్ 625’, పాన్ డీ కూడా క్వాలిటీగా లేవని తేలింది.

  • Loading...

More Telugu News