Viral News: ఎక్స్‌పీరియన్స్ లెటర్ అడిగితే 3 నెలల జీతం డిమాండ్ చేసిన కంపెనీ.. సాయం కోరుతున్న యువకుడు

An employee was wrongfully terminated by an Indian company just one day after submitting their resignation

  • అనారోగ్య కారణాలను చూపించినా రిజైన్‌ను ఆమోదించని కంపెనీ
  • రిజైన్ తిరస్కరించి.. మరుసటి రోజు తొలగింపు
  • ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ అడిగితే 3 నెలల జీతం అడిగిన వైనం

ఓ యువకుడు కోటి ఆశలతో ఉద్యోగంలో చేరాడు. కానీ ఒత్తిడి భరించలేక అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. ఇంకా ఇబ్బందులు తెచ్చుకోకూడదనే ఉద్దేశంతో ఏడాది కూడా తిరగకుండానే జాబ్‌కి రిజైన్ చేశాడు. అయితే రిజైన్‌ లెటర్‌ను తిరస్కరించిన సదరు కంపెనీ... మరుసటి రోజే ఆ యువకుడిని నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగంలోంచి తొలగించింది. సరే అయ్యిందేదో అయ్యింది... ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ యువకుడు కోరగా.. 3 నెలల జీతం ఇవ్వాలని కంపెనీ ఎదురు డిమాండ్ చేసింది. రూల్స్‌కు విరుద్ధంగా, అర్ధాంతరంగా కంపెనీని వీడిపోయావంటూ భవిష్యత్‌లో పనిచేయబోయే కంపెనీకి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (బీజీవీ) ప్రక్రియలో తెలియజేస్తామని బెదిరింపులకు పాల్పడింది. చెన్నైకి చెందిన ఓ యువకుడికి ఈ దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. సోషల్ మీడియా మాధ్యమం ‘రెడ్డిట్‌’ వేదికగా అతడు తన ఆవేదనను పంచుకున్నాడు. చెన్నైలో కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు సాయం చేయాలని నెటిజన్లను కోరుతూ పూర్తి వివరాలు వెల్లడించాడు.

రెడ్డిట్‌లో ‘ర్యాండీ31599’ అనే యూజర్ తనకు ఎదురైనా పరిస్థితిని వివరించాడు. పనిలో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొన్నానని, ఈ పరిస్థితి అనారోగ్య సమస్యలకు దారితీసిందని, అందుకే తాను రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నట్టు యువకుడు చెప్పాడు. మెడికల్ కారణాలు చెప్పానని, నెలలోపు కంపెనీ నుంచి రిలీవ్ చేయాలని కోరినా పట్టించుకోలేదని తెలిపాడు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ కొనసాగాల్సిందేనని చెప్పారని యువకుడు వివరించాడు. 

‘‘నేను ప్రాజెక్ట్ మేనేజర్‌ని. కంపెనీలో 8 నెలలకు పైగా పనిచేశాను. నాకు మంచి జీతం వచ్చినప్పటికీ పని ఒత్తిడి భరించలేకపోయాను. నెల క్రితం నాకు ఫ్యాటీ లివర్‌ సమస్య వచ్చింది. ఆ తర్వాత చికెన్‌పాక్స్ కూడా సోకింది. ఆ సమయంలో 3 రోజులు సెలవు కావాలని కోరాను. అయితే ఇంటి దగ్గర నుంచి పని చేయాలని సీఈవో కోరారు. అందుకు నిరాకరించాను. టీమ్‌కు పాక్షికంగా మాత్రమే నా సపోర్ట్ ఇవ్వగలిగాను’’ అని చెప్పాడు. 

ఈ పరిణామాల తర్వాత ఆరోగ్యం దృష్ట్యా రిజైన్ చేస్తే సీఈవో ఆమోదించకుండా నిరాకరించారని యువకుడు చెప్పాడు. ఆ తర్వాత కారు ప్రమాదానికి గురయ్యానని, ఈ కారణాలను కూడా చూపి మరోసారి రిజైన్ చేసినా ఆమోదించలేదని వివరించాడు. రిజైన్ చేసే క్రమంలో రెండు రోజులు సెలవు తీసుకున్నానని, సెలవు తీసుకున్న మరుసటి రోజు కంపెనీ బెదిరింపులకు పాల్పడిందని అతడు చెప్పాడు. ఉద్యోగంలోంచి తొలగిస్తున్నట్టుగా మెయిల్ పంపించారని, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియలో తాను తప్పు చేసినట్టుగా రిపోర్ట్ ఇస్తామని బెదిరిస్తున్నారని అతడు పేర్కొన్నాడు.

దీంతో మంచి లాయర్‌ను సంప్రదించాలని చాలామంది నెటిజన్లు సదరు యువకుడికి సూచించారు. కార్మిక మంత్రిత్వ శాఖను సంప్రదించాలని మరికొందరు సూచించారు.

  • Loading...

More Telugu News