KTR: బలుపు మాటలు తగ్గించుకో కేటీఆర్!: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- పదేళ్ల కాలంలో ఫిరాయింపులకు కేటీఆర్ అడ్రస్‌గా నిలిచారని విమర్శ
- ఇప్పుడు నీతులు చెబుతున్నారని ధ్వజం
- కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్న
కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హితవు పలికారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన కేటీఆర్ ఈరోజు నీతులు చెబుతారా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... అరవై మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను చేర్చుకున్న నువ్వు కూడా ఫిరాయింపుల గురించి మాట్లాడుతావా? అని నిలదీశారు.
నాడు ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి చేర్చుకున్నది ఎవరని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టి, బెదిరించి బీఆర్ఎస్‌లో చేర్చుకున్న సన్నాసి ఎవరు? అని ధ్వజమెత్తారు.
రోజుకో ఎమ్మెల్యేను చేర్చుకొని చివరకు విలీనం అంటూ అబద్ధాలు చెప్పిన దగాకోరులు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు పార్టీలను మింగేసి ఇప్పుడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యమంటూ నంగనాచి కబుర్లు చెబుతావా? అని ధ్వజమెత్తారు.
పదేళ్ల పాటు కేటీఆర్, కేసీఆర్ ప్రదర్శించిన అతి తెలివిని తెలంగాణ ప్రజలు చూశారన్నారు. రాష్ట్రంలోని సిగ్గు, మర్యాద లేని కుటుంబం ఏదైనా ఉందా అంటే అది కల్వకుంట్ల కుటుంబమే అన్నారు. నాడు ఫిరాయింపులకు పాల్పడి ఇప్పుడు సుద్దపూసలు మాటలు చెబుతున్నారని చురక అంటించారు. అయినా ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ప్రజలు ఛీత్కరించినా మీడియాలో నానడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డిని ఆడిపోసుకోవడమే బీఆర్ఎస్ దొంగల ముఠాకు పనిగా మారిందని విమర్శించారు. ఫిరాయింపులపై బీఆర్ఎస్ చేస్తే సంసారం... ఇతరులు చేస్తే వ్యభిచారమా? అని ప్రశ్నించారు. వరుస ఎన్నికల్లో ఓడిపోయినా బుద్ధి రావడం లేదన్నారు.