LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీ నిజమే.. బోర్డు గురించి జగన్ కు చెప్పినా వినలేదు: మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం
- ల్యాబ్ రిపోర్ట్ ద్వారా లడ్డూ విషయం వెలుగు చూసిందన్న ఎల్వీ
- నిర్ధారించుకోవడానికి సీఎంకు సమయం పట్టి ఉంటుందని వ్యాఖ్య
- సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్న ఎల్వీ
- టీటీడీ బోర్డులో ఎక్కువ మంది ఉంటే ఇబ్బందులేనని వ్యాఖ్య
- తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని ఆవేదన
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని తాను పూర్తిగా నమ్ముతానని ఏపీ మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. పక్కా ఆధారాలతో, ల్యాబ్ రిపోర్ట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత... అందులో నిజం ఎంత ఉందో అనే దానిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ధారించుకోవడానికి ముఖ్యమంత్రికి కొంత సమయం పట్టి ఉంటుందని... అందుకే లడ్డూ కల్తీపై ఆయన ప్రకటన చేయడం కొంత ఆలస్యమై ఉంటుందని చెప్పారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఒక పవిత్రమైన హైందవ క్షేత్రంపై కుట్ర ప్రకారం ఏమైనా చేశారా? లేదా కొంత డబ్బును వెనకేసుకోవడానికి (అవినీతి) చేసిన ప్రయత్నమా? అనేది తనకు తెలియదని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.
తాను సీఎస్ గా ఉన్న సమయంలో టీటీడీ బోర్డులోకి పెద్ద సంఖ్యలో సభ్యులను తీసుకున్నారని... ఇది కరెక్ట్ కాదని సీఎం జగన్ కు చెప్పానని, ఆయన వినలేదని ఎల్వీ తెలిపారు. బోర్డు సభ్యులకు హిందూ ధర్మం గురించి తెలియదని, వారు వారి పనులతో బిజీగా ఉంటారని చెప్పారు. బోర్డు మీటింగులకు ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంటారని అన్నారు. బోర్డు సభ్యులు ఎక్కువైతే ఉపయోగం కంటే ఇబ్బందులే ఎక్కువని చెప్పారు. బోర్డు మీటింగులకు హాల్ సరిపోదని... పెద్ద ఆడిటోరియం కావాల్సి ఉంటుందని అన్నారు. ఈవో మెత్తగా ఉంటే... బోర్డు సభ్యులు ఒత్తిడికి గురి చేసి ఈవోను ఆటాడించే అవకాశం ఉందని చెప్పారు.
తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని... అన్యమతానికి చెందిన పాంప్లెట్స్ కూడా దొరికాయని తెలిపారు. టీటీడీ ఉద్యోగుల్లో కొందరి పేర్లు రికార్డుల్లో హిందువులుగానే ఉంటాయని... కానీ తర్వాతి రోజుల్లో వారు అన్యమతం స్వీకరించి ఉంటారని చెప్పారు. శ్రీశైలంలో కూడా తాను ఇలాంటివి చూశానని తెలిపారు. మతం మారిన వారికి హిందూ ధర్మంపై విశ్వాసం ఉండదని చెప్పారు.
తిరుమల లడ్డూ అపవిత్రంపై తాను కూడా ప్రాయశ్చిత్తాన్ని పాటిస్తున్నానని ఎల్వీ చెప్పారు. జూబ్లీహిల్స్ లోని వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని... జరిగిన తప్పుకు క్షమించాలని స్వామిని కోరుకున్నానని తెలిపారు.