Laapataa Ladies: కిరణ్‌ రావు మాట నిజ‌మైందిగా.. ఆస్కార్‌కు 'లాపతా లేడీస్‌'

Laapataa Ladies Is Indias Official Entry For Oscars 2025

  • ఆమిర్ ఖాన్ నిర్మాణం, ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వంలో ‘లాపతా లేడీస్’
  • ఇండియా నుంచి 2025 ఆస్కార్‌కు ఎంపిక
  • ఈ విషయాన్ని అధికారికంగా ప్ర‌క‌టించిన‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా

బాలీవుడ్ ఖాన్ త్ర‌యంలో ఒక‌రైన ఆమిర్ ఖాన్ నిర్మాణంలో, ఆయన మాజీ భార్య కిరణ్‌ రావు దర్శకత్వం వ‌హించిన మూవీ ‘లాపతా లేడీస్’. ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఈ మూవీ 2025 ఆస్కార్‌కు ఇండియా నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని తాజాగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా ప్ర‌క‌టించింది.

ఇదిలాఉంటే.. రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో కిరణ్ రావు మాట్లాడుతూ... తమ చిత్రం ఆస్కార్‌ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంద‌ని జోస్యం చెప్పారు. తమ సినిమా ఆస్కార్ కు వెళ్లాలనేది తనతో పాటు చిత్ర యూనిట్ కోరిక అని కూడా తెలిపారు. ఫిల్మ్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా తనవంతు బాధ్యతగా ఈ సినిమాను త‌ప్ప‌కుండా ఆస్కార్‌కు పంపిస్తుందనే నమ్మకం త‌న‌కు ఉంద‌ని చెప్పుకొచ్చారు. ఆమె అన్న‌ట్టుగానే మూవీ ఆస్కార్‌కు ఎంపిక అయింది.

కాగా, ఈ చిత్రానికి ముందు ఆమె ఆమిర్ ఖాన్‌ హీరోగా ‘దోబీ ఘాట్‌’ అనే చిత్రానికి ద‌ర్శ‌కురాలిగా ప‌ని చేశారు. ఈ మూవీ కూడా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. డైరెక్ట‌ర్‌గా ఆమెకు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇప్పుడు ‘లాపతా లేడీస్‌’తో మ‌రోసారి ద‌ర్శ‌కురాలిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నారు. కిరణ్ రావు ఏకంగా ఆస్కార్ స్థాయి చిత్రాన్ని తెర‌కెక్కించడం విశేషం.  

ఇక‌ మార్చి 1న విడుద‌లైన ‘లాపతా లేడీస్‌’ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డ్స్‌ను సొంతం చేసుకుంది. అలాగే సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా కూడా కోర్టు అడ్మినిస్ట్రేట్‌ వేడుకల్లోనూ ఈ మూవీని ప్రదర్శించ‌డం జ‌రిగింది.

‘లాపతా లేడీస్‌’ స్టోరీ ఇదే..
2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు న‌వ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ‘లాపతా లేడీస్‌’ తెర‌కెక్కింది. కొత్తగా పెళ్లి అయిన ఓ జంట వివాహం త‌ర్వాత‌ ఇంటికి వస్తుండగా మధ్యలో ఈ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. 

కానీ, ఈ విష‌యం తెలియ‌ని వ‌రుడు త‌న భార్య అనుకుని వేరే వ్య‌క్తి భార్యను ఇంటికి తీసుకువచ్చేస్తాడు. తీరా ఇంటికి వ‌చ్చిన త‌ర్వాత వ‌ధువును చూసి త‌న భార్య కాద‌ని షాక్ అవుతాడు. దీంతో త‌న భార్య త‌ప్పిపోయింద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తాడు. అయితే త‌న భార్య ఎలా మిస్ అయింది? తన భార్య స్థానంలో వ‌చ్చిన యువ‌తి ఎవ‌రు? ఆ త‌ర్వాత చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌లు ఏంటి? అనే క‌థాంశంతో మూవీని కిరణ్‌ రావు చాలా బాగా తీశారు.

  • Loading...

More Telugu News