Abhinav Mukund: అలా జరిగి.. 24 గంటలు గడవకముందే డ్యూటీకి వచ్చేశా: భారత మాజీ క్రికెటర్ ఎమోషనల్ పోస్టు
![Less Than 24 Hours After My Grandmother Passed Away Indian Cricketer Abhinav Mukund Pens Emotional Note](https://imgd.ap7am.com/thumbnail/cr-20240923tn66f11d1ca534a.jpg)
- చెన్నై టెస్టుకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అభినవ్ ముకుంద్
- అమ్మమ్మ చనిపోయి 24 గంటలు గడవకముందే విధులు నిర్వహించిన వైనం
- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్న మాజీ క్రికెటర్
- వ్యాఖ్యాతగా ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఇలా చేయాల్సి వచ్చిందన్న ముకుంద్
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ నమోదు చేసింది. భారత క్రికెట్ జట్టు ఏకంగా 280 పరుగుల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. అయితే, ఈ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ తన అమ్మమ్మ చనిపోయి 24 గంటలు కూడా గడవకముందే మళ్లీ కామెంటరీ చెప్పేందుకు వచ్చేశాడట. ఈ విషయాన్ని ముకుంద్ తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఇది వ్యాఖ్యాతగా తనకు తొలి మ్యాచ్ కావడంతో మిస్ కాకూడదనే ఉద్దేశంతో ఇలా చేసినట్లు అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
"మా అమ్మమ్మ మరణించి 24 గంటలు కూడా గడవకముందే నా మొదటి మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సి వచ్చింది. క్రికెటర్ నుండి ఇప్పుడు వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు మొదట్లో కొంచెం భయాందోళనకు గురయ్యాను. కానీ అదృష్టవశాత్తూ నేను చెపాక్‌లోని ఇంటిలో ఉన్నట్లు భావించాను. దాంతో నా ప్రయాణం సులువైంది. ఈ 4 రోజులు లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత ప్రతిభతో చూపించిన గొప్ప ప్రదర్శనను ఆస్వాదించాను. దివంగత షేన్ వార్న్ ఐదు వికెట్లు పడగొట్టిన రికార్డును సమం చేయడం చూశాను. ఇది ఎంతో అద్భుతమైన అనుభూతి" అని ముకుంద్ తన ఇన్‌స్టా పోస్టులో రాసుకొచ్చాడు.
"నా మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆస్వాదించాను. గందరగోళం మధ్య నేను ప్రశాంతంగా ఉండేలా మా అమ్మమ్మ నన్ను చూసుకుందని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. నాకు తోడ్పాటు అందించిన తోటి వ్యాఖ్యాతలకు చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు కాన్పూర్‌కు బయల్దేరాను" అని ముకుంద్ చెప్పుకొచ్చాడు.
ఇక భారత స్పిన్నర్ అశ్విన్ టెస్టు క్రికెట్‌లో తన 37వ ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించిన విషయం తెలిసిందే. బంగ్లాతో మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 88 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతతో అశ్విన్ దిగ్గజ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ షేన్ వార్న్‌తో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో రెండవ అత్యధిక ఐదు వికెట్ల రికార్డును సమం చేశాడు. కాగా, 67సార్లు ఐదు వికెట్లు తీసిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఇదిలాఉంటే.. తొలి టెస్టు విజయంతో జోష్‌లో ఉన్న భారత్.. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.