Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం... రోడ్లపై నిలిచిన నీరు
- కుండపోత వర్షంతో జలమయమైన రోడ్లు
- రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారుల ఇబ్బందులు
- తార్నాక, కోఠి, మాదాపూర్ సహా పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షంతో నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చాలామందికి వీకెండ్ సెలవులు కావడంతో బయటకు వచ్చారు. మరికొంతమంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయం కావడంతో ప్లై ఓవర్ల కింద తలదాచుకున్నారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది.
తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, మేడిపల్లి, చిలుకానగర్, కోఠి, అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అడిక్‌మెట్, రాంనగర్, గాంధీనగర్, జవహర్ నగర్, కవాడిగూడ, దోమలగూడ, భోలక్‌పూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లి, హైదర్ నగర్, నిజాంపేట, ప్రగతి నగర్, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
హైదరాబాద్‌లో భారీ వర్షం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నాలాల వద్ద వరద నీరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరంలో... వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపారు.