VC Sajjanar: ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు: టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- డ్రైవర్ గణేశ్‌పై దాడికి పాల్పడిన దుండగులు
- గణేశ్‌కు సంస్థ తరఫున అండగా ఉంటామని హామీ
- మెరుగైన వైద్యసాయం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి
ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కుషాయిగూడ డిపోకు చెందిన డ్రైవర్ గణేశ్‌పై ఇటీవల దాడి జరిగింది. తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతనిని సజ్జనార్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సంస్థ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్య సాయం అందించాలని వైద్యులను కోరారు.
అఫ్జల్ గంజ్ నుంచి ఘట్‌కేసర్ వైపునకు వెళుతున్న మెట్రో బస్సులో గణేశ్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీ వై జంక్షన్ వద్ద కొంతమంది వ్యక్తులు అతనిపై దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులు కలిసి గణేశ్‌ను తీవ్రంగా కొట్టారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన గణేశ్‌ను తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సజ్జనార్ మాట్లాడుతూ... ఈ విషయంలో తమ సిబ్బంది తప్పు లేదని, బైక్‌లపై వచ్చిన వారు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన వెంటనే హైదరాబాద్ కమిషనరేట్, ఓయూ పోలీసులు స్పందించారని తెలిపారు. దుండగులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమ సిబ్బందిపై దాడి చేయడం బాధాకరమన్నారు. సిబ్బందిపై దాడికి పాల్పడితే యాజమాన్యం సహించదన్నారు.