BJP Leader Madhavi Latha: మతమార్పిడి చేసుకున్న నేతల వల్లే ఈ పరిస్థితి: తిరుపతి లడ్డూ వ్యవహారంపై మాధవీలత వ్యాఖ్యలు
![Madhavilatha who came to the screen for the first time after the election Comments on Tirumala Laddu](https://imgd.ap7am.com/thumbnail/cr-20240921tn66eedf6fe76ad.jpg)
- తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాధవిలత
- ఈ వ్యవహారాన్ని అత్యాచారంతో పోల్చిన మాధవి లత
- నిజం తెలిసే వరకు పోరాడతానన్న మాధవి
సాక్షాత్తు వైకుంఠ వాసుడే మనకోసం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్షేత్రం కూడా తిరుమలే. అటువంటి క్షేత్రంలో భగవంతుని ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వ్యవహారంపై తాజాగా తెలంగాణ బీజేపీ మహిళా నేత మాధవీలత స్పందించారు.
ఇప్పటికైనా ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి స్పందించాలని కోరారు. కేంద్రంలో ఉన్న మంత్రులు ఈ వ్యవహారంపై స్పందించి సీబీఐ విచారణ జరిపించాలని మాధవీలత విజ్ఞప్తి చేశారు.
"మతమార్పిడి చేసుకున్న నాయకులు పరిపాలించడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. వాళ్లకి సంబంధించిన మందిరాల్లో హిందువులని నియమించుకుంటారా... అలాంటివి ఏమీ ఉండవు కదా, మరి హిందూ దేవాలయాల్లో అలాంటి వారు ఎలా నియమించబడుతున్నారు? ఈ విషయంపై హిందువులందరూ కలిసి పోరాడాలి. ఎవరు వదిలిపెట్టినా ఈ విషయంలో నిజం తేలే వరకు నేను వదిలిపెట్టను" అని మాధవీలత స్పష్టం చేశారు.
అందరం కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాం అనే కంటే ఆ ప్రసాదాన్ని భక్షిస్తున్నాం అనడం సబబుగా ఉంటుందేమో. జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన తర్వాత... ప్రసాదాన్ని తింటున్నాం అనే మాట నేను అనలేకపోతున్నాను. భక్షించే పరిస్థితికి తీసుకువచ్చారు. ఇన్ని వేలమంది, కోట్ల మంది హైందవుల నమ్మకాన్ని భక్తిని అడ్డం పెట్టుకొని మోసం చేయాలనుకున్న ఆ దుర్మార్గులు ఎవరో కానీ పరమేశ్వరుడు వారికి పుట్టగతులు లేకుండా చేస్తాడు. వాళ్ళు ఎవరన్నది తేలాల్సిందే" అని మాధవీలత పేర్కొన్నారు.