Arya Vyshya: పొట్టి శ్రీరాములు పేరును తొలగించడంపై స్పందించిన ఆర్యవైశ్య మహాసభ

Arya Vyshya Maha Sabha unhappy with removal of Potti Sriramulu name

  • తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ
  • సురవరంను గౌరవించే క్రమంలో శ్రీరాములు పేరును తొలగించడం సరికాదని వెల్లడి
  • ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం పేరును పెట్టాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పొట్టి శ్రీరాములు పేరును మార్చడం సరైన నిర్ణయం కాదని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు.

పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో... రాష్ట్రానికో చెందినవారు కాదని గుర్తించాలన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడు అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు పెట్టారని, కానీ ఇప్పుడు మార్చడం సరికాదన్నారు.

తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టి గౌరవించుకోవడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఆయనను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగించడం సరికాదన్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News