India vs Bangladesh: చెన్నై టెస్టు... సెంచ‌రీల‌తో క‌దంతొక్కిన పంత్, గిల్‌... బంగ్లాదేశ్ ముందు భారీ ల‌క్ష్యం!

Bangladesh need 515 Runs to Win in Chennai Test
  • చెన్నై వేదిక‌గా భార‌త్‌, బంగ్లాదేశ్ తొలి టెస్టు
  • 287/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన టీమిండియా
  • తొలి ఇన్నింగ్స్‌లో 227 ప‌రుగ‌ల ఆధిక్యాన్ని క‌లుపుకొని బంగ్లాకు 515 ర‌న్స్ టార్గెట్‌
  • శ‌త‌కాల‌తో చెల‌రేగిన‌ పంత్ (109), గిల్ (119 నాటౌట్‌)
చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య భార‌త జ‌ట్టు ప‌ట్టు బిగించింది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 81/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 287/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 227 ప‌రుగుల ఆధిక్యాన్ని క‌లుపుకొని బంగ్లాదేశ్‌కు 515 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.  

భార‌త ఇన్నింగ్స్‌లో యువ ఆట‌గాళ్లు రిష‌భ్ పంత్‌, శుభ్‌మ‌న్ గిల్ సెంచ‌రీల‌తో క‌దంతొక్కారు. పంత్ 109 ప‌రుగులు చేసి ఔట్ కాగా, గిల్ 119 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ద్వ‌యం 167 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యం నెల‌కొల్పింది. 

బంగ్లాదేశ్‌ బౌల‌ర్ల‌లో మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ 2 వికెట్లు తీయ‌గా... న‌హీద్ రాణా, త‌స్కిన్‌ అహ్మ‌ద్ త‌లో వికెట్ ప‌డ‌గొట్టారు. ఇక బంగ్లా త‌న మొద‌టి ఇన్నింగ్స్ లో 149 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే. 

కాగా, బంగ్లా టైగ‌ర్స్‌కు 515 ప‌రుగుల‌ భారీ టార్గెట్ ఛేద‌న‌కు రెండున్న‌ర రోజుల స‌మ‌యం ఉంది. అయితే, భార‌త బౌల‌ర్లను ఎదుర్కొని బంగ్లాదేశ్ ఈ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డం అంత సులువేమీ కాదు.
India vs Bangladesh
Chennai Test
Team India
Cricket
Rishab Pant
Subhman Gill

More Telugu News