AP High Court: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంకు బిగ్ రిలీఫ్ .. అత్యాచారం ఒట్టిదేనన్న బాధితురాలు!

case against mla adimulam was fake says victim to high court

  • సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ 
  • తాను చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవమని హైకోర్టుకు తెలిపిన బాధిత మహిళ
  • ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశం
  • తగిన ఉత్తర్వులకు విచారణ 25కు వాయిదా

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అదిమూలంపై ఫిర్యాదు చేసిన బాధిత మహిళ స్వయంగా హైకోర్టుకు హజరై ..ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ఆరోపణలు అన్నీ అవాస్తవమని పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేసింది. ఆదిమూలంపై నమోదు చేసిన కేసు తప్పుడు కేసు అని, దానిని కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆదిమూలంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. తగిన ఉత్తర్వులు జారీ చేసేందుకు విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. 
 
తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని కొన్ని రోజుల క్రితం తిరుపతి జిల్లా కేబీకే పురం మండలానికి చెందిన మహిళ .. ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ పరిణామంతో టీడీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. 

మరో పక్క ఈ కేసును కొట్టేయాలంటూ ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేయకుండా కేసు నమోదు చేశారని, మూడో వ్యక్తి ఒత్తిడితో పిటిషనర్ పై ఆ మహిళ ఫిర్యాదు చేశారని, ఇది హనీట్రాప్ అని ఆదిమూలం తరపు న్యాయవాది సి రఘు హైకోర్టులో వాదనలు వినిపించారు. కాగా, పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అన్నీ అవాస్తవం అంటూ అఫిడవిట్ దాఖలు చేశామని, దానిని పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేపై కేసును కొట్టేయాలని కోరడం జరిగిందని బాధిత మహిళ తరపు న్యాయవాది కె జితేందర్ వాదనలు వినిపించారు.

  • Loading...

More Telugu News